-
అండగా ఉంటా.. అగ్రిమెంట్ అమలు కోసం కృషి చేస్తా: వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి జిల్లా: సీఐఎస్ఎఫ్ పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడిన కార్మికులును బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద కాంట్రాక్టు కార్మికుల గేట్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఘటన వివరాలను కార్మిక సంఘం జేఏసీ నాయకులు కౌశిక్ హరి, గాయపడిన బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపట్టిన కాంట్రాక్టు కార్మికులపై సీఐఎస్ఎఫ్ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్నిఆయన తీవ్రంగా ఖండించారు.
సీఐఎస్ఎఫ్ బలగాల లాఠీఛార్జీ ఘటనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కార్మికులపై లాఠీఛార్జ్ చేయమని ఆదేశించిన అధికారులు, కొట్టిన వారి పై చర్యలు తీసుకునేలా కేంద్ర మంత్రితో మాట్లాడుతానన్నారు. కాంట్రాక్టు కార్మికుల అగ్రిమెంట్ అమలు కోసం కృషి చేస్తానని.. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయండి.. నా మద్దతు ఎప్పటికీ ఉంటుందని వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు.
