సీబీఐ ఆఫీసు గేట్ నుంచి వెనక్కి వచ్చిన వైఎస్ అవినాష్

సీబీఐ ఆఫీసు గేట్ నుంచి వెనక్కి వచ్చిన వైఎస్ అవినాష్

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి..  సీబీఐ కార్యాలయం గేట్ నుంచే వెనుదిరిగారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కోసం ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. అప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జరుగుతుండటంతో.. 2023, ఏప్రిల్ 18వ మంగళవారం ఉదయం 10 గంటలకు రావాలని సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో తన కాన్వాయ్ ను వెనక్కి తిప్పి.. మళ్లీ ఇంటికి చేరుకున్నారు. తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్  చేసిన తర్వాత.. అవినాష్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు ఇచ్చింది.

ఎప్పుడు రమ్మన్నా పిటిషన్లు: సీబీఐ లాయర్

అవినాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. ఎప్పుడు విచారణ రమ్మని పిలిచినా.. అవినాష్ రెడ్డి పిటీషన్లు వేస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సీబీఐ తరపు లాయర్. దీనిపై అవినాష్ రెడ్డి లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తున్నారని.. ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని.. విచారణ తీరును ప్రశ్నిస్తూనే పిటీషన్లు దాఖలు చేయటం జరిగిందని వాదించారు.  

ఏప్రిల్ 30వ తేదీలోగా కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని సీబీఐ లాయర్ తెలిపారు. అవినాష్ రెడ్డిని ఎప్పుడు పిలిచినా కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ ఇన్వెస్టిగేషన్ కు ఆటంకం కలిగిస్తున్నారని సీబీఐ లాయర్ తెలిపారు.