వివేకా హత్య కేసు.. వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత.. తిరుపతి స్విమ్స్‌కు తరలింపు

వివేకా హత్య కేసు.. వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత.. తిరుపతి స్విమ్స్‌కు తరలింపు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివేకా హత్య జరిగిన రోజున అక్కడే ఉన్న వాచ్‌మెన్ రంగన్న కోర్టుకు ఇచ్చిన 164 వాంగ్మూలంలో వివేకాను ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి హత్య చేసినట్టు తెలిపిన విషయం తెలిసిందే. వయసు రీత్యా పలు అనారోగ్య కారణాలతో వాచ్ మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో రంగన్న ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మే2న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే.. పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించడంతో అంబులెన్స్‌లో రంగన్నను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు మే2న వివేకా పీఏ కృష్ణా రెడ్డిని ప్రశ్నించారు. హత్యకు ముందు వివేకానందరెడ్డి రాసిన లేఖను కృష్ణా రెడ్డి దాచిపెట్టడంపై మరిన్ని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన కృష్ణారెడ్డిని ఐదు గంటలకు పైగా విచారించారు.