పుతిన్కు మూడు గంటలు అత్యవసర చికిత్స ?

పుతిన్కు మూడు గంటలు అత్యవసర చికిత్స ?

69 ఏళ్ల రష్యా అధ్యక్షుడు పుతిన్..  జులై 22న (శుక్రవారం అర్ధరాత్రి) తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనకు అత్యవసర చికిత్స అందించేందుకు హుటాహుటిన రెండు వైద్య బృందాలు రష్యా అధ్యక్ష కార్యాలయానికి వెళ్లాయట. దాదాపు మూడు గంటల పాటు  వైద్య నిపుణులు అధ్యక్ష భవనంలోనే ఉండి పుతిన్ కు చికిత్స అందించారని కథనాల్లో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాతే వైద్యులు అక్కడి నుంచి వెళ్లినట్లు తెలిపారు. జులై 23 సాయంత్రం వరకు పుతిన్ కు అత్యవసర వైద్య  చికిత్స కొనసాగిందని చెప్పారు.

ఈమేరకు వివరాలతో రష్యాకు చెందిన టెలిగ్రామ్ చానల్ ‘జనరల్ ఎస్వీఆర్’ కథనాన్ని ప్రచురించిందని బ్రిటన్ మీడియా సంస్థ ‘ఇండిపెండెంట్’ వెల్లడించింది. ‘జనరల్ ఎస్వీఆర్’  అనే  టెలిగ్రామ్ చానల్ ను రష్యా ఇంటెలిజెన్స్ విభాగంలో గతంలో లెఫ్టినెంట్ జనరల్ గా  పనిచేసిన ఓ వ్యక్తి నడుపుతున్నారని ‘న్యూజిలాండ్ హెరాల్డ్’ పత్రిక కథనాన్ని ప్రచురించింది.  కాగా, గత రెండు దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా రష్యా అధ్యక్షుడిగా పుతిన్ వ్యవహరిస్తున్నారు.