- ఏజీఆర్ డిమాండ్లను పరిశీలించండి..కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పులతో సతమతం అవుతున్న టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ)కు సుప్రీంకోర్టులో సోమవారం ఊరట లభించింది. 2016-–17 వరకు ఉన్న సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) అదనపు పన్ను డిమాండ్లను తిరిగి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కాలానికి ఏఐ రూ.5,606 కోట్లు చెల్లించాలని డాట్ నోటీసులు పంపింది. 2018–19 వరకు ఐడియా, వీఐ కోసం లైసెన్సు ఫీజు బకాయిల మొత్తాన్ని కూడా మార్చింది. పన్ను డిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ వీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ డిమాండ్లను రద్దు చేయాలన్న రిక్వెస్టుకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే వీఐ తన బ్యాలెన్స్ షీట్‌ను సరిచేసుకోవడానికి, కొత్త మూలధనాన్ని పొందడానికి, నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టడానికి వీలవుతుంది.
“ఏజీఆర్‌కి సంబంధించిన సమస్యలపై మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడానికి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. దాదాపు 20 కోట్ల మంది కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను పరిష్కరించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్)తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాం" అని వొడాఫోన్ ఐడియా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. డాట్ ట్యాక్స్ డిమాండ్లను సవాలు చేస్తూ వీఐ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ గవాయి, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ఈ అంశం ప్రభుత్వ విధాన పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వీఐకి మొత్తం రూ. 1.7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇందులో రూ. 83 వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాలి. వాయిదా చెల్లింపు పథకం కింద 2026 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా రూ. 18 వేల కోట్లు కట్టాలి. ఇది దాని ప్రస్తుత కరెంట్ఆపరేషనల్ క్యాష్ జెనరేషన్ రూ. 9,200 కోట్లకు దాదాపు రెట్టింపు. ఒక కంపెనీ తన సాధారణ రోజువారీ వ్యాపార కార్యకలాపాల ద్వారా ఎంత నగదును సృష్టిస్తుందో కొలిచే ముఖ్యమైన ఆర్థిక కొలమానం ఇదని ఒక ఎనలిస్టు వివరించారు.
ఎక్స్పర్టులు ఏమంటున్నారంటే..
ఏజీఆర్ బకాయిల విషయంలో వీఐ రిక్వెస్టులకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తే వీఐ దశ తిరుగుతుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. టెలికం మార్కెట్లో కంపెనీ పుంజుకుంటుందని అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వీఐ షేర్లు 3.85 శాతం పెరిగి రూ. 9.99కి చేరుకున్నాయి. ‘‘వీఐకి ఇప్పుడు అంతా అనుకూలంగా ఉందని అర్థం కాదు కానీ ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. బ్యాలెన్స్ షీట్‌ను సరిచేసుకోవడానికి, కొత్త మూలధనాన్ని పొందడానికి, నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. ఏజీఆర్ విషయంలో రిలీఫ్ దొరికినా స్పెక్ట్రమ్బకాయిల భారం ఉంటుంది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎనలిస్టు తెలిపారు. కోర్టు తీర్పు వీఐకి తాత్కాలిక ఉపశమనం అని ఎవరెస్ట్ గ్రూప్ ప్రాక్టీస్ డైరెక్టర్ టైటస్ అన్నారు. బకాయిలను తగ్గిస్తే, 5జీ మార్కెట్‌ను పెంచుకోవచ్చని అన్నారు. ఏజీఆర్ బకాయిలపై తుది నిర్ణయం వీఐకి అనుకూలంగా వస్తేనే బ్యాంకుల నుంచి వీఐకి ఆర్థికసాయం దొరుకుతుందని ఇన్‌గవర్న్ ఫౌండర్ శ్రీరామ్ సుబ్రమణియన్ వివరించారు.
