మెదక్, వెలుగు: వాలీబాల్ అండర్ 17 బాల, బాలికలకు నిర్వహించిన పోటీల్లో బాలుర విభాగంలో మెదక్ జిల్లా జట్టు, బాలికల విభాగంలో సంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించాయి. ఆదివారం మెదక్ పట్టణంలోని గీతా హై స్కూల్ గ్రౌండ్లో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల వాలీబాల్ జట్ల మధ్య పోటీలు జరిగాయి. ఇందులో మెదక్ జిల్లా బాలుర జట్టు ప్రతిభ కనబరిచి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా జట్లను ఓడించి ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ద్వితీయ స్థానం సిద్దిపేట, తృతీయ స్థానంలో సంగారెడ్డి జిల్లా జట్లు నిలిచాయి.
బాలికల విభాగంలో సంగారెడ్డి జిల్లా జట్టు సిద్దిపేట, మెదక్ జిల్లా జట్లపై విజయం సాధించి ప్రథమ బహుమతి సాధించగా, సిద్దిపేట ద్వితీయ స్థానం, మెదక్ జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు గీత హై స్కూల్ ప్రిన్సిపాల్ సుగుణాకర్, పాఠశాల క్రీడా సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్ గంగాల, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా మాజీ కార్యదర్శి కిషోర్, మాధవ రెడ్డి, చంద్రమోహన్ బహుమతులు అందజేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా కు ఎంపికైన అండర్ 17 వాలీబాల్ బాలబాలికలు ఈ నెల 28 న పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని కార్యదర్శి రమేశ్ గంగాల తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు వినోద్ కుమార్, మనోహర్, శేఖర్, దేవేందర్ రెడ్డి, నరేశ్, పద్మ, అరుణ కుమార్ పాల్గొన్నారు.