మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు 

మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు 

నిజామాబాద్, వెలుగు:  ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనుల పేరుతో అధికార పార్టీ నేతలే  ఇసుక దందా చేస్తున్నారు. మంజీరా నదిలో 8 ప్రాంతాల నుంచి ఇసుక తవ్వుతున్నారు. పర్మిషన్ లేకుండా క్వారీల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాది క్రితం వీఆర్ఓ హత్య వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందని ఫిర్యాదులున్నాయి. ఇసుక దందాకు అధికార పార్టీ కీలక నేత కుమారుల అండ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి

 ఇష్టారాజ్యం... 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ , బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి బీర్కూర్, బిచ్కుంద మండలాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కోటగిరి మండలంలోని కల్లూరు, కొడిచర్ల పోతంగల్ హంగర్గ, కారేగావ్, సుంకిని వద్ద  ఆరు క్వారీలు, బోధన్ మండలంలో మందార్న, సిద్ధాపూర్ లో రెండు క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలకు అనుమతి లేకపోవడంతో అధికారులు నిలిపివేశారు. అయినా అవేమీ పట్టకుండా వ్యాపారులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. అభివృద్ధిపనులకు  వేబిల్స్ కు కాలపరిమితి తో రెవెన్యూ శాఖ అనుమతి జారీ చేస్తోంది. కానీ, వేబిల్స్​ గడువుతో సంబంధం లేకుండా ఇసుక తరలిస్తున్నారు. రోజుకు వందల్లో....రోజూ వందలాది టిప్పర్ల ఇసుక ఇక్కడ నుంచి తరలిపోతోంది. ప్రతి వేబిల్​కు  రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంది. అయితే ఒకే వే బిల్లు మీద పది నుండి 20 టిప్పర్ల ఇసుకను రవాణాచేస్తున్నారు. అధికార పార్టీ లోని కీలక పదవిలో ఉన్న నేత కుటుంబసభ్యుల అండదండలతో ఇదంతా జరుగుతోందని  ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమరవాణాపై అధికారుల నిఘా గాలికి పోయింది. తరలిస్తున్న ఇసుకను ఇతర ప్రాంతాల్లో డంప్ చేసి టిప్పర్ ఇసుకను రూ. 10 వేల నుంచి 15 వేల వరకు వసూల్​ చేస్తున్నారు. గత నెలలో రూ. 15 కోట్ల ఇసుక దోపిడీ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఈ ప్రాంతాల్లో గ్రామపెద్దలను భయపెట్టి, భౌతిక దాడులు చేసి ఇసుక అక్రమదందా నడిపిస్తున్నారు. ఏడాది క్రితం ఖండ్గావ్ సిద్ధాపూర్ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న కిందిస్థాయి ఉద్యోగులపై దాడులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖండ్ గావ్ వీఆర్ ఏ పై దాడి చేయడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈఘటనలో ఇసుక మాఫియా ప్రమేయం ఉందని కుటుంబసభ్యులు సహా ఉద్యోగులు ఆందోళనలు చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆందోళనలకు దిగారు. కానీ ఇసుక మాఫియా నిందితులపైచర్యలు చేపట్టలేదు

నిఘా లోపంతో అక్రమదందా ...

జిల్లా నుంచి ఇసుకను అక్రమంగా హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలు , కర్నాటక రాష్ట్రంలోని బీదర్, గుల్బర్గా ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ సాండ్ పాయింట్ల తో పాటు మంజీరా నది పక్కన ఖండ్గావ్ , సుంకిని ప్రాంతాల నుండి ఇసుక ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. బోధన్ డివిజన్ లో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలోనే పోలీస్ ఆఫీసర్ ను బదిలీ చేశారని ప్రచారం ఉంది. పోలీసుల సహకారంతోనే రాత్రివేళల్లో తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  బోధన్ , బాన్స్ వాడ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ల ఇసుక కోటా కంటే 5 రేట్లు అధికంగా తవ్వకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో బాన్స్ వాడ్ నియోజకవర్గంలోనే డబుల్ బెడ్ రూమ్ 4 వేల ఇండ్ల నిర్మాణాలు జరిగాయి. వీటికోసం ఇసుక తవ్వకాలకు పర్మిషన్   మంజూరు చేశారు. అసెంబ్లీ స్పీకర్ ఏరియా కావడంతో ఇసుక రవాణా నిబంధనలకనుగుణంగా జరుగుతుందని రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లు భావించారు. కానీ అక్రమార్కులు యథేచ్ఛగా దోపిడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఆఫీసర్ల దే బాధ్యత 

ఒక‌‌‌‌ దగ్గర పర్మిషన్ తో ఇంకో దగ్గర ఇసుక తవ్వుతున్రు. అభివృద్ధి పనులకు అనుమతి ఇచ్చినా తవ్వకాలు, రవాణపై నిఘా కొరవడింది. నిబంధనల ఉల్లంఘన జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.  స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు మంజీరా నదితీర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపై నిఘా పెంచాలి. అక్రమ తవ్వకాలు రవాణా సమాచారం ఉన్నా స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్రు..– సుభాష్​ జాదవ్ , జిల్లా వాసి

అక్రమదందాకు అధికారపార్టీ అండ 

 మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు బీఆర్ఎస్ నేత కుటుంబం అండదండలు ఉన్నాయి. ఇసుకను రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్రు. నామమాత్రం గా పర్మిట్ తీసుకుని ఎక్కువ మొత్తంలో ఇసుక తవ్వుతున్నారు. అక్రమ రవాణను ఆపేందుకు ఆఫీసర్లు భయపడుతున్రు. – కొట్టం మనోహార్, ఎంపీటీసీ, కోటగిరి