ఓటు అమ్ముకునే వస్తువు కాదు.. భవిష్యత్ ను మార్చే శక్తి అని మైలారంలో వాల్ పోస్టర్లు వెలిశాయి

 ఓటు అమ్ముకునే వస్తువు కాదు.. భవిష్యత్ ను మార్చే శక్తి   అని మైలారంలో వాల్ పోస్టర్లు వెలిశాయి
  •     హనుమకొండ జిల్లా మైలారంలో వెలిసిన వాల్ పోస్టర్లు  
  •     మైలారం యువశక్తి, విద్యావంతుల వేదిక పేరుతో ఏర్పాటు

శాయంపేట, వెలుగు : ‘ ఓటు అమ్ముకునే వస్తువు కాదు.  గ్రామ ప్రజల భవిష్యత్​ను మార్చే శక్తి’ ..అంటూ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారంలో వాల్ పోస్టర్లు వెలిశాయి.  వీటిని మైలారం యువశక్తి , విద్యావంతుల వేదిక పేరుతో ఏర్పాటు చేయడమే కాకుండా ఇంటింటికి పాంప్లెట్లను కూడా పంపిణీ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు, మద్యం కోసం ఓటును అమ్ముకోవద్దని, నిజాయతీ పాలనకే ఓటు వేయాలని కోరారు. ఇందుకు గ్రామం నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఐదేండ్ల అభివృద్ధికి ఓటేద్దాం.. డబ్బు, మద్యం కోసం కాదని సూచించారు.  

అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు, కక్ష రాజకీయాలు పాల్పడకుండా గ్రామాభివృద్ధి ప్రణాళికలపై చర్చ జరిగే విధంగా చేస్తేనే మనమంతా అభివృద్ధి పథంలో నడుస్తామని పేర్కొన్నారు. నిజాయతీ, పారదర్శకతకు కట్టుబడి ఉండే అభ్యర్థినే ఎన్నుకోవాలని సూచించారు. ఇప్పటినుంచే మార్పు ప్రారంభమై భవిష్యత్ తరాలకు మంచి రాజకీయ జీవితాలను అందించిన వాళ్లమవుతామని తెలిపారు.