
- కర్నాటకలో జరిగిన సర్వేలో ఓట్ల చోరీ బయటపడింది
- దీనిపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడతామని వెల్లడి
- సీజ్ ఫైర్ చేయడానికి ట్రంప్ ఎవరు?
- ఆయన కామెంట్లపై ప్రధాని మోదీ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్న
న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతున్నదని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్నాటకలోని ఓ పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడిందని చెప్పారు. ఓట్ల దొంగతనం ఎలా జరుగుతున్నదో ప్రజలతోపాటు ఎలక్షన్ కమిషన్‌కు వివరిస్తామని ప్రకటించారు.
బుధవారం (జులై 24) పార్లమెంట్హౌస్ కాంప్లెక్స్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఇది కేవలం 52 లక్షల మంది ఓటర్లకు లేదంటే బిహార్ కు సంబంధించినది మాత్రమే కాదు.. వారు మహారాష్ట్రలోనూ మోసం చేశారు.. మేం ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించాం.. ఓటర్ల జాబితా చూపించాలని అడిగాం. వారు మాకు ఓటర్ల జాబితాను చూపించలేదు. మేం వీడియోగ్రఫీ అడిగాం. వారు చట్టాన్ని మార్చారు. మహారాష్ట్రలో ఒక కోటి మంది కొత్త ఓటర్లు వచ్చారు. ఓట్లు దొంగిలించారు” అని రాహుల్ అన్నారు.
బిహార్‌లో ఎస్ఐఆర్ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లను దొంగిలిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము నిశ్శబ్దంగా కూర్చోబోమని, వీధుల నుంచి పార్లమెంట్‌దాకా పోరాడతామని స్పష్టం చేశారు. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్ల జాబితా సవరణ కోసం ఇంటింటికి వెళ్లిన ఎన్నికల అధికారులు.. ఇప్పటివరకూ 52 లక్షలకు పైగా ఓటర్లు తమ చిరునామాల్లో లేరని, మరో 18 లక్షల మంది మరణించారని తేల్చారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
సీజ్ ఫైర్ చేయడానికి ట్రంప్ ఎవరు?
భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకూ 25 సార్లు జపం చేశారని రాహుల్‌గాంధీ అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. భారత్–పాక్ మధ్య జరిగిన సీజ్‌ఫైర్‌పై ట్రంప్ పదే పదే మాట్లాడుతున్నారని, ఈ ప్రకటన అనుమానాస్పదంగా ఉందన్నారు. అసలు సీజ్ ఫైర్ చేయడానికి ట్రంప్ ఎవరని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటివరకూ ప్రధాని మోదీ ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదన్నారు.
‘‘కేవలం కాల్పుల విరమణే కాదు.. రక్షణ రంగం, ఆపరేషన్సిందూర్కు సంబంధించి మనం చర్చించాలి. పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. తమకు తాము దేశభక్తులం అని చెప్పుకునేవారు పారిపోయారు. దీనిపై ప్రధాని మోదీ ఒక్క ప్రకటన కూడా చేయలేకపోతున్నారు” అని అన్నారు. కాల్పుల విరమణను తానే చేయించానని ట్రంప్పదేపదే చెప్తున్నా కేంద్రం ఎందుకు స్పందించడంలేదని రాహుల్ ప్రశ్నించారు.
‘‘అసలు కేంద్రం ఏం చెప్పాలనుకుంటున్నది. ట్రంపే కాల్పుల విరమణ చేయించారనా? కానీ అలా చెప్పలేరు. అయినా.. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ చేయడానికి ట్రంప్ ఎవరు? అది ఆయన పనికాదు’’ అని అన్నారు. అయితే, మోదీ విదేశాల నుంచి తిరిగొచ్చాక ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు కేంద్రం అంగీకరించిందని రాహుల్ చెప్పారు.