మోదీ ప్రధాని కావడానికి ఓట్ల చోరీనే కారణం ...మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి: రాహుల్ గాంధీ

మోదీ ప్రధాని కావడానికి ఓట్ల చోరీనే కారణం ...మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి: రాహుల్ గాంధీ
  • హర్యానాలో ఏం జరిగిందోఇటీవలే బయటపెట్టినం
  • దీనిపై ఈసీ నుంచిఖండన కూడా రాలేదు
  • మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్​లోనూఓట్ల చోరీ జరిగింది
  • బిహార్​ ఎన్నికల్లో ఇదే పథకంతో ముందుకు సాగుతున్నరు
  • మోదీ, అమిత్​ షా, ఈసీ కుమ్మక్కై రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని ఫైర్​

న్యూఢిల్లీ: ఓట్ల చోరీతోనే ప్రధానమంత్రి పీఠాన్ని నరేంద్ర మోదీ కైవసం చేసుకున్నారని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. ఇప్పటికే ఎన్నో ఆధారాలు బయటపెట్టామని, త్వరలో మరిన్ని బయటపెడ్తామని చెప్పారు. మోదీ, అమిత్​ షా, ఎన్నికల కమిషన్​ కుమ్మక్కయ్యాయని దుయ్యబట్టారు. ఈ త్రయం మన రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో రాహుల్​గాంధీ మీడియాతో మాట్లాడారు. 

‘‘బీజేపీ, ఈసీ కలిసి ఓట్ల చోరీకి ఎలా తెగబడుతున్నాయో దేశంలోని యువతకు, ముఖ్యంగా జెన్ ​జెడ్​ తరానికి కాంగ్రెస్​ స్పష్టంగా ఆధారాలతో చూపెడ్తున్నది. ఇటీవలే హర్యానా ఓట్ల చోరీని బయటపెట్టాం. మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్​లో ఓట్ల చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. అవన్నీ బయటికి తీస్తాం. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు” అని స్పష్టం చేశారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యారంటే దానికి ఓట్ల చోరీనే ప్రధాన  కారణమని ఆయన ఆరోపించారు.

హర్యానా అంశంపై ఈసీ స్పందనేది?

నిరుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిన తీరును ఇటీవలే ప్రెస్ ​కాన్ఫరెన్స్​లో వెల్లడించామని, అక్కడ జరిగినవి ఎన్నికలు కావని, అది మొత్తం ఓట్ల దోపిడీ అని రాహుల్​గాంధీ దుయ్యబట్టారు. తాము లేవనెత్తిన ఆరోపణలకు, నకిలీ ఓట్లకు ఎలక్షన్​కమిషన్​ నుంచి ఎందుకు స్పందన రాలేదని ప్రశ్నించారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కయ్యాయని.. ఖండించే సాహసం కూడా చేయలేకపోయారని అన్నారు. ‘‘రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండాలి. కానీ, హర్యానా ఎన్నికలు.. ఒక వ్యక్తికి అనేక ఓట్లు అన్న తీరుగా నడిచింది. బిహార్​లో కూడా ఇదే తరహాలో కుట్రలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్​, చత్తీస్​గఢ్, గుజరాత్​లో ఎప్పుడూ ఇదే తంతు కొనసాగుతోంది” అని రాహుల్ ​ ఆరోపించారు.

‘ఓట్​ చోరీ’ సర్కార్​లో ‘ల్యాండ్​ చోరీ’

మహారాష్ట్రలో దళితులకు కేటాయించిన రూ.1,800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్కడి ప్రభుత్వం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ కొడుకు పార్థ్ పవార్​కు రూ.300 కోట్లకే కట్టబెట్టిందని రాహుల్​గాంధీ మండిపడ్డారు. ‘‘ఓట్ల దొంగతనంతో అధికారంలోకి వచ్చినవాళ్లు ఇట్ల యథేచ్ఛగా ల్యాండ్​ చోరీకి తెగబడ్తున్నరు. ‘ఓట్​ చోరీ’ సర్కార్​లో ‘ల్యాండ్​ చోరీ’ నడుస్తున్నది. దళితుల భూమిని అతి తక్కువ ధరకు అమ్మేయడమే కాకుండా స్టాంప్​ డ్యూటీని కూడా రద్దు చేసి దోపిడీకి చట్టపరంగా ఆమోద ముద్ర వేసేసుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదు. దళితులు, పేదల హక్కులను కాలరాస్తూ.. దోపిడీదారులకు వంతపాడుతున్నారు” అని శుక్రవారం ఎక్స్​లో పోస్ట్​ పెట్టారు.