కాంగ్రెస్ ఖాతాలోకి మరో రాష్ట్రం..కేరళ గెలుపుతో సౌత్‌‌లో మూడో రాష్ట్రంలో పాగా

కాంగ్రెస్ ఖాతాలోకి మరో రాష్ట్రం..కేరళ గెలుపుతో సౌత్‌‌లో మూడో రాష్ట్రంలో పాగా
  • కేరళ గెలుపుతో సౌత్‌‌లో మూడో రాష్ట్రంలో పాగా 
  • ఇప్పటికే  తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్​ సర్కారు
  • ఇప్పుడు కేరళలో యూడీఎఫ్‌‌ సంచలన విజయం

న్యూఢిల్లీ:  దక్షిణాదిలో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. ఇప్పటికే కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న హస్తం పార్టీ, ఇప్పుడు కేరళలోనూ జైత్రయాత్రను కొనసాగించింది. తాజాగా.. వెలువడిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్‌‌) ప్రభంజనం సృష్టించింది. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న లెఫ్ట్‌‌ డెమోక్రటిక్‌‌ ఫ్రంట్‌‌ (ఎల్డీఎఫ్) పాలనకు చరమగీతం పాడుతూ, కేరళ ఓటర్లు యూడీఎఫ్ వైపు మొగ్గు చూపారు.

మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో, యూడీఎఫ్ 102  స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. ఇందులో ఒక్క కాంగ్రెస్ పార్టీయే 63 స్థానాలను గెలుచుకోవడం విశేషం. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా మలబార్ రీజియన్‌‌లో ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్‌‌) తో కలిసి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.

దక్షిణాదిలో కాంగ్రెస్ బలమిదీ..

గత రెండేండ్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకుంటూ వస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటకలో మొత్తం 224 స్థానాలకుగాను కాంగ్రెస్ ఏకంగా 135 స్థానాలను గెలుచుకుని భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ బీజేపీని కేవలం 66 స్థానాలకే పరిమితం చేసి తన సత్తా చాటింది. తెలంగాణలోనూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనకు బ్రేక్ వేస్తూ కాంగ్రెస్ సంచలన విజయం సాధించింది. మొత్తం 119 స్థానాల్లో కాం గ్రెస్ 65 స్థానాలను గెలుచుకొని రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. కర్నాటక, తెలంగాణ తర్వాత ఇప్పుడు కేరళలోనూ విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలే స్తున్నది.  ఈ విజయంతో దక్షిణాదిలో ప్రధాన రాష్ట్రాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఇది రాబోయే జాతీయ రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌‌కు పెద్ద బూస్ట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.