తెలంగాణలో ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం (డిసెంబర్ 14) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్​చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు. 

సెకండ్ ఫేజ్‎లో భాగంగా 193 మండలాల్లోని 3 వేల 911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 38 వేల 350 పోలింగ్ ​కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారు. కొన్నింటిని మోడల్​పోలింగ్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. రాష్ట్రవ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఉత్సాహంగా ఓటేసేందుకు తరలివచ్చారు. 

ఫలితంగా సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా మిగిలిన అన్నీ చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేశారు.