
న్యూఢిల్లీ: ‘రాజ్య సభ చరిత్రలో 39 ఏళ్లు ప్రతిపక్షాలదే పైచేయిగా ఉంది.. మిగతా విషయాల మాటెలా ఉన్నా చట్టాల రూపకల్పనకు ఇదేమీ అడ్డురాలేదు’ అని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. రాజ్యసభ 68వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సోషల్ మీడియాలో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు. లోక్ సభ, రాజ్య సభ లకు ఎన్నికల విధానం వేర్వేరుగా ఉండడంతో ప్రభుత్వానికి లోక్ సభలో మెజారిటీ ఉంటుంది కానీ రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం ఉండదన్నారు. ఏళ్ల తరబడి ఇలాగే జరుగుతోందని వెంకయ్య నాయుడు చెప్పారు. కొన్ని సందర్భాల్లో సభ తన స్వతంత్రను కాపాడుకుందని గుర్తుచేశారు. 1961 లో డౌరీ ప్రొహిబిషన్ బిల్ 1959, 1978లో ది బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్ 1977, 2002 లో ది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్2002 లను రాజ్యసభ రిజెక్ట్ చేసిందన్నారు. రాజ్యసభలో బిల్లులు పాస్ కావడానికి బాగా ఆలస్యమవుతుందన్న కామెంట్స్ పై స్పందిస్తూ.. అత్యవసరమైన బిల్లుల విషయంలో సభ ఎన్నడూ ఆలస్యం చేయలేదన్నారు. 1994 ఆగస్టు 25న ఒకేరోజు ఐదు రాజ్యాంగ సవరణ బిల్లులను పాస్ చేసిందని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు.