ఇందిరా పార్క్ వద్ద బతుకమ్మలతో నిరసనకు వీఆర్ఏల యత్నం

ఇందిరా పార్క్ వద్ద బతుకమ్మలతో నిరసనకు వీఆర్ఏల యత్నం
  • అడ్డుకోవడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో బైఠాయింపు
  • ధర్నాతో పరిస్థితి ఉద్రిక్తం.. పోలీసుల లాఠీచార్జ్
  • అరెస్ట్ చేసి రాత్రి వరకు పోలీస్ స్టేషన్​లో నిర్బంధం

హైదరాబాద్‌‌, వెలుగు: తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వీఆర్​ఏలు చేపట్టిన బతుకమ్మలతో నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా వీఆర్ఏలను పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. వారు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులు లాఠీచార్జీ చేయగా.. పలువురికి గాయాలయ్యాయి. అరెస్టు చేసి మహిళలని కూడా చూడకుండా రాత్రి పొద్దుపోయే వరకు పోలీస్​స్టేషన్లో నిర్బంధించారు. పేస్కేల్, ప్రమోషన్లు, 50 ఏండ్లు నిండిన వారి వారసులకు ఉద్యోగాలివ్వాలని 79 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వీఆర్ఏ జేఏసీ మంగళవారం చలో ఇందిరాపార్క్ కు పిలుపునిచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు జిల్లాల్లో ముందస్తుగా వేలది మందిని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ.. సుమారు 2 వేల మంది మహిళా వీఆర్ఏలు హైదరాబాద్ కు చేరుకున్నారు. వారంతా ఇందిరాపార్క్ వైపు వస్తుండడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోనే పోలీసులు అడ్డుకున్నారు. వారు అక్కడే కూర్చొని ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళా వీఆర్​ఏలు పోలీస్ స్టేషన్లలో బతుకమ్మ ఆడారు. వారిని మధ్యాహ్నం ఒంటి గంటకు అదుపులోకి తీసుకోగా.. రాత్రి 9దాటినా రిలీజ్ చేయలేదు. ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేస్తామని మహిళా వీఆర్‌‌ఏలను బెదిరింపులకు గురి చేశారు.

ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ నాయకులు మాట్లాడుతూ 3నెలలుగా జీతాలివ్వకపోవడంతో పూట గడవడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. తామేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.