సీఎస్ తో వీఆర్ఏల చర్చలు సఫలం

సీఎస్ తో వీఆర్ఏల చర్చలు సఫలం

వీఆర్ఏలు సమ్మె విరమించారు. రేపటి నుంచి విధుల్లోకి చేరుతామని ప్రకటించారు. బీఆర్కే భవన్ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డితో సీఎస్ సోమేశ్ కుమార్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో గత 80 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు రవీందర్ రెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు.

మునుగోడు బైపోల్ ఒత్తిడి దెబ్బకు..

చివరకు మునుగోడు బైపోల్ ఒత్తిడి దెబ్బకు సర్కార్ దిగి వచ్చింది. అయితే మునుగోడు కోడ్ నే సాకుగా చూపిస్తూ బైపోల్ తర్వాత హామీలు అమలు చేస్తామని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. సమ్మె కాలానికి సంబంధించిన జీతం, సమ్మె చేస్తున్నప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం సహా పలు డిమాండ్లపై మునుగోడు బై పోల్ తర్వాత నిర్ణయాలు ప్రకటిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రమోషన్ల అంశంపైనా సీఎస్ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ హామీ మేరకు ప్రస్తుతానికి తాము సమ్మెను విరమించామని చెప్పారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రభుత్వానికి రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ..

ఏడాది క్రితమే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ గత 80 రోజులుగా వీఆర్ఏలు ఉద్యమం చేశారు. ఇటీవలే  అసెంబ్లీ సమావేశాల టైంలో వీఆర్ఏల నిరసనలు ఇరకాటంగా మారడంతో మంత్రి కేటీఆర్ వారిని పిలిపించి మాట్లాడారు. ఇప్పటికిప్పుడు చేయలేమని కొంచెం టైం కావాలని చెప్పారు. స్పష్టమైన హామీ లేకపోవడంతో  వీఆర్ఏలు నిరసనలు కొనసాగించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా మరోసారి సీఎస్ మాట్లాడినా సమస్యలను పరిష్కరించలేదు. రోజూ జిల్లాల నుంచి హైదరాబాద్ వరకు వీఆర్ఏల నిరసనలు సర్కార్ కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే బైపోల్ లో జనం సమస్యలపై ఒత్తిడి పెరుగుతుండడంతో సర్కారు ఏదో ఒకటి చేయకతప్పలేదు. దీంతో సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఏ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించారు. బీఆర్కే భవన్ లో జరిగిన చర్చల్లో ప్రభుత్వ హామీలను నెరవేరుస్తామని సీఎస్ సోమేష్ హామీ ఇచ్చినట్లు వీఆర్ఏ జేఏసీ ఛైర్మన్ రమేశ్ బహదూర్ తెలిపారు. 

వీఆర్ఏలకు అసెంబ్లీలో హామీలు

పేస్కేల్, ఉద్యోగ భద్రత, ప్రమోషన్, కారుణ్య నియామకాలపై గతంలో సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు అసెంబ్లీలో హామీలు ఇచ్చారు. వాటిని ప్రభుత్వం ఎంతకూ అమలు చేయకపోవడంతో వీఆర్ఏలు సమ్మెకు దిగారు. మునుగోడు ఎన్నికల కోడ్ ఉండడంతో వీఆర్ఏల హామీలు వెంటనే నెరవేర్చలేకపోతున్నామని, కోడ్ ముగియగానే హామీలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు ట్రెసా ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి. సమ్మె కాలంలో వేతనం, సమ్మె చేస్తున్నప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం వంటి వాటిపై మునుగోడు బైపోల్ తర్వాత చర్చిస్తామన్నారు వంగా రవీందర్ రెడ్డి. 

అనేక రకాలుగా ఒత్తిళ్లు

80 రోజుల సమ్మె కాలంలో వీఆర్ఏలపై సర్కార్ అనేక రకాలుగా ఒత్తిళ్లు తెచ్చింది. తమ కుటుంబాలు ఆగమవుతున్నా సర్కార్ దారుణంగా వేధిస్తోందని పలువురు వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. పలు చోట్ల నిరసనల్లో పోలీసులు లాఠీఛార్జ్ లు చేశారు. మంగళవారం సిటీలో బతుకమ్మలతో నిరసనలు చేసేందుకు వచ్చిన మహిళా వీఆర్ఏలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అయినా సిటీకి చేరుకున్న పలువురు వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మహిళలు సహా అనేక మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో రాత్రి వరకు ఉంచారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో వదిలిపెట్టారు.

చివరకు సీఎస్ తో భేటీలో.. 

నిజానికి సీఎస్ తో భేటీ కంటే ముందే.. ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆ భేటీలో సమ్మె విరమించాలని రవీందర్ రెడ్డి కోరగా... హామీల అమలు చేయాలని జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. చివరకు సీఎస్ తో భేటీలో అంగీకారం తెలపడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. 13 నుంచి విధుల్లోకి వెళ్తామన్నారు. అయితే చర్చలపై పలువురు వీఆర్ఏ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక కూడా మునుగోడు కోసమే గొర్రెలకు పైసలిచ్చే స్కీంను సర్కార్ ప్రకటించింది. రాష్ట్రం మొత్తం ఉండే వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి మాత్రం కోడ్ అడ్డం వస్తుందని చెప్పడంపై డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.