వీఆర్వోలకు ట్రాన్స్​ఫర్​ ఇష్టం లేకుంటే వీఆర్ఎస్​

వీఆర్వోలకు ట్రాన్స్​ఫర్​ ఇష్టం లేకుంటే వీఆర్ఎస్​

హైదరాబాద్, వెలుగు: విలేజ్​ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) పోస్టులను రద్దు చేస్తుండటంతో వారందరినీ ఇతర డిపార్ట్​మెంట్లలోకి ట్రాన్స్​ఫర్​ చేస్తామని సీఎం కేసీఆర్​ తెలిపారు. ట్రాన్స్​ఫర్​ ఇష్టం లేకుంటే వీఆర్ఎస్​ తీసుకోవచ్చని, రాజీనామా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇతర శాఖల్లోకి వెళ్లేవారికి సంబంధిత పేస్కేల్ ​ప్రకారం జీతాలు ఇస్తామని, దీనితో సర్కారుపై రెండు, మూడు వందల కోట్ల భారం పడుతుందని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో ‘అబాలిషన్​ ఆఫ్​ ది పోస్ట్స్​ ఆఫ్​ విలేజీ రెవెన్యూ ఆఫీసర్స్​యాక్ట్​–2020’ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ కోసం వీఆర్వోలను నియమించారని.. ప్రస్తుతం రికార్డులన్నీ డిజిటలైజేషన్​ చేయడంతో ఆ పోస్టు అవసరం లేనిదిగా మారిందని కేసీఆర్​ చెప్పారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను సంప్రదించే రద్దు నిర్ణయం తీసుకున్నామన్నరు. గెజిట్​వచ్చే తేదీ నుంచే వీఆర్వో పోస్టులు రద్దవుతాయన్నారు. వారిని నాలుగు నెలల్లో ఏదైనా డిపార్ట్​మెంట్లో సమాన కేడర్ లోకి ట్రాన్స్​ ఫర్​గానీ, విలీనం గానీ చేస్తామన్నారు. అందుకు ఇష్టం లేనివారు వీఆర్ఎస్​గానీ, రిజైన్​గానీ ఆప్షన్  ఎంచుకోవచ్చని తెలిపారు. ఈ చట్టం అమల్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే.. దాన్ని తొలగించేందుకు సర్కారు ఆర్డర్​ జారీ చేస్తుందన్నారు.