
బీజేపీపై సీఎం కేసీఆర్ది, తనది ఒకే అభిప్రాయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ తో జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. బీజేపికి ప్రత్యామ్నాయ ఎజెండాపై కేసీఆర్ చాలా వర్క్ చేశారని చెప్పారు. కేసీఆర్ ఆహ్వానం మేరకే భేటీ అయ్యానని.. ముఖ్యమంత్రి తనకు చాలా గౌరవం ఇచ్చారని అరుణ్ కుమార్ చెప్పారు. తాను రాజకీయాల్లోకి రానని కేసీఆర్ ఫోన్ చేసినప్పుడే చెప్పానన్నారు. తనతో పాటు ఈ మీటింగ్ లో ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారని.. అయితే కేసీఆర్ తో జాతీయ పార్టీ గురించి మాట్లాడదలేదని వివరించారు. కేసీఆర్ మంచి కమ్యూనికేటర్ అని కితాబిచ్చారు.
బీజేపీ వల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉందని అరుణ్ కుమార్ అన్నారు. మోడీ ప్రధాని అవడంలో ఎటువంటి అభ్యంతరం లేదని.. అయితే ఆ పార్టీ విధానాలు మాత్రం బాగా లేవని అభిప్రాయపడ్డారు. బీజేపీలో తనకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారని.. అయినా ఆ పార్టీని విమర్శిస్తూనే ఉంటానని చెప్పారు. ఇక ఏపీలో బీజేపీని ఎవరూ వ్యతిరేకించడం లేదని.. జగన్, పవన్, చంద్రబాబు ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారో జనానికి తెలియదా అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయానన్న అరుణ్ కుమార్.. త్వరలోనే అన్ని విషయాలను కేసీఆర్ వెల్లడిస్తారని స్పష్టం చేశారు.