వ్యూహం మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్

వ్యూహం మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్

ఏపీ సీఎం వైఎస్‌‌ జగన్‌‌ రాజకీయ జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రెండు భాగాలుగా చిత్రీకరించిన సినిమాలు  ‘వ్యూహం’, ‘శపథం’. జగన్‌‌గా అజ్మల్, భారతిగా మానస నటించారు. దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈనెల 23న ‘వ్యూహం’ విడుదల చేస్తున్నట్టు, అలాగే మార్చి 1న ‘శపథం’ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఈ రెండు చిత్రాల ట్రైలర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో వర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమాలను డిసెంబర్‌‌‌‌లోనే రిలీజ్ చేయాలనుకున్నాం . కానీ కోర్టు కేసుల వల్ల ఆలస్యమైంది. వారం రోజుల తేడాతో మా రెండు సినిమాలు రిలీజ్ కావడం వల్ల ఇబ్బందేమి ఉండదు. నచ్చితే రెండు సినిమాలూ చూస్తారు. నచ్చకుంటే రెండూ చూడరు. సెన్సార్ వాళ్లు ఈ సినిమాలో కొన్ని సీన్స్ తీసేశారు.

అయినా కథలోని ఎమోషనల్ కంటెంట్ మిస్ కాలేదు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి నుంచి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవరకు ‘వ్యూహం’ కథ ఉంటుంది. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం నుంచి చంద్రబాబు జైలుకు వెళ్లేవరకు ‘శపథం’ కథ చూపిస్తున్నాం’ అని చెప్పాడు. ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్‌‌లో రిలీజ్ చేయబోతున్నాం అని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్పారు.