ఎస్ఆర్ డీపీ, ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ పనులపై బల్దియాకు ఎదురుచూపు!

ఎస్ఆర్ డీపీ, ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ పనులపై బల్దియాకు ఎదురుచూపు!
  • ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ ఫేజ్-2 పనులపై రిప్లయ్ ఇవ్వని ప్రభుత్వం
  • అధికారులు ప్రపోజల్స్ పంపినా ముందుకు సాగని ప్రాసెస్
  • పనులపై సిద్ధంగా ఉండాలని చెప్పి అనుమతులివ్వని సర్కార్
  • సెకండ్  ఫేజ్ పనులు చేస్తామని ఇప్పటికే  మంత్రి కేటీఆర్ ప్రకటన
  • వరదల నివారణ, ట్రాఫిక్ సమస్య తీరేందుకు ఫేజ్–2 పనులే కీలకం

హైదరాబాద్, వెలుగు:  స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్​మెంట్ ప్లాన్ (ఎస్ఆర్ డీపీ), స్ట్రాటజిక్ నాలా  డెవలప్​మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ) సెకండ్ ఫేజ్ పనులపై బల్దియాకు ఎదురు చూపులే అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతుండగా ఆయా పనులు ముందుకు కదలడంలేదు. ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్​కు ఏడాది కిందట బల్దియా అధికారులు ప్రపోజల్స్ పంపారు.  పలు సవరణలు చేసి మరోసారి పంపాలని ప్రభుత్వం సూచించగా.. ఇటీవల తిరిగి సర్కార్​కు అందజేశారు. తాజాగా రూ.4,300 కోట్లతో 36 పనులు చేసేందుకు ప్రతిపాదించారు. ఎస్ఆర్​డీపీ సెకండ్ ఫేజ్ పనులకు గత నెలలోనే అనుమతులు వస్తాయని అనుకోగా ప్రభుత్వం  నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అదేవిధంగా ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ కు పనులకు  బల్దియా పరిధితో పాటు శివారు మున్సిపాలిటీలకు రూ.5, 000 వేల కోట్లతో 400 పనులకు అధికారులు ప్రపోజల్స్ పంపించారు. ఇందులో గ్రేటర్ కు సంబంధించి రూ.1,000 కోట్లతో  70 పనులు ఉన్నాయి. వీటికి కూడా ఎన్నికలలోపు అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ..ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండగా ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన రావడంలేదు. అనుమతులు ఏ క్షణంలో వచ్చినా  కూడా పనులు చేసేందుకు అధికారులు రెడీగా ఉన్నారు.

ఎస్ఆర్డీపీ ఫేజ్-2లో ..

ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్​కు  ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తే 36 పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో స్కై వేలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్​లు చేపట్టనున్నారు. ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్, కూకట్ పల్లి వై జంక్షన్, బండ్లగూడలో ఫ్లైఓవర్, ఒమర్ హోటల్ జంక్షన్, రేతిబౌలి–నానల్‌‌‌‌నగర్‌‌‌‌లో మల్టీలెవల్ అండర్‌‌‌‌పాస్, ఫలక్ నుమా ఆర్ వోబీ, కుత్బుల్లాపూర్‌‌‌‌లో ఫాక్స్ సాగర్ పైప్‌‌‌‌లైన్‌‌‌‌పై వంతెన నిర్మాణం, ఖాజాగూడలో సొరంగం,  మాణికేశ్వర్ నగర్ ఆర్ యూబీ, చిలకలగూడలో ఆర్ యూబీ, ఆరాంఘర్‌‌‌‌లో రెండు రూబిల నిర్మాణంతో పాటు  ఇంకొన్ని పనులు చేయనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు  రాకపోతుండగా మోక్షం కలగడంలేదు. ఇవి పూర్తయితే సిటీలో చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా నానల్ నగర్ జంక్షన్ లాంటి ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది.

ఎస్ఎన్డీపీ సెకండ్ ఫేజ్ లో..

గ్రేటర్ లో వరదల నివారణకు ఫస్ట్ ఫేజ్ కింద రూ. 737.45 కోట్లతో  37 నాలా పనులు చేపట్టారు. ఇందులో 6 పనులు కొనసాగుతున్నాయి.  రెండేళ్ల కిందట వీటిని ప్రారంభించిన సమయంలో  రూ.1000  కోట్లతో దాదాపు 70 నాలాల పనులు చేపట్టాలని సెకండ్ ఫేజ్ కు అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు.  దీనిపై సర్కార్ నుంచి  ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఫస్ట్ ఫేజ్ పనుల పురోగతిపై వివరాలు అడిగితెలుసుకున్న మంత్రి కేటీఆర్ సెకండ్ ఫేజ్ పనులు స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. సెకండ్ ఫేజ్ లో అనుమతిస్తే వరదలకు గురయ్యే ప్రాంతాల్లో నాలాలు, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం జరగనుంది.

జీవో ఇచ్చినా పనులు కష్టమే..

సెకండ్ ఫేజ్ పనులకు ఇప్పుడు పరిపాలన అనుమతులు ఇచ్చిన కూడా ఇప్పటికప్పుడు ప్రారంభమయ్యే అవకాశంలేదు. జీవో వచ్చిన తర్వాత పనులకి సంబంధించిన డీపీఆర్ తో పాటు  టెండర్లు పూర్తి చేసేందుకు ఆరునెలలకుపైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. ఎన్నికల లోపు పనులు స్టార్ట్ చేయడం కష్టమే. అనుమతులు ఇచ్చి ఎన్నికల ప్రచారంలో  భాగంగా సిటీ ఓటర్లకు గాలం వేసేందుకే అనుమతులు ఇచ్చేట్టు కనిపిస్తుంది. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనులకు సంబంధించి అసెంబ్లీతో పాటు సమావేశాలు జరిగిన కూడా మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో  మేయర్ తో పాటు అధికారపార్టీ కార్పొరేటర్లు  పదేపదే చెబుతూనే ఉన్నారు. గడిచిన నాలుగైదేళ్లుగా చెబుతున్నారు. కానీ కొత్త పనులపై చెప్పడంలేదు.  ఇప్పుడు వచ్చిన కదలికతో నైనా ప్రభుత్వం అనుమతులిస్తే బాగుంటుందని సిటీవాసులు కోరుతున్నారు.