గోడ కూలి గాల్లో కలిసిన కూలీ ప్రాణం..భారీ వానకు కూలడంతో ప్రమాదం...ఆరుగురికి తీవ్ర గాయాలు

గోడ కూలి గాల్లో కలిసిన కూలీ ప్రాణం..భారీ వానకు కూలడంతో ప్రమాదం...ఆరుగురికి తీవ్ర గాయాలు
  • గుండ్లపోచంపల్లిలో వీ కన్వెన్షన్​ ప్రహరీని ఆనుకుని షెడ్లు వేసిన సంస్థ
  • భారీ వానకు కూలడంతో ప్రమాదం 

జీడిమెట్ల, వెలుగు: మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వీ​కన్వెన్షన్​ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో ఆ గోడను ఆనుకుని గుడిసెలు వేసుకున్న కూలీల్లో ఒకరు చనిపోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుండ్లపోచంపల్లిలోని వీ కన్వెక్షన్​గోడ పక్కన అపర్ణ రెడిమిక్స్​కంపెనీ తన ప్లాంట్​లో పనిచేసే ఒడిశా వలస కూలీల కోసం తాత్కాలికంగా రేకుల షెడ్లను నిర్మించింది. ఇందులో కొందరు కూలీలు నివాసం ఉంటూ తమకు ఇచ్చిన పనులు చేసుకుంటున్నారు. 

ఆదివారం రాత్రి షెడ్లలో పడుకోగా, భారీ వర్షానికి ఒక్కసారిగా ప్రహరీ కూలింది. దీంతో ఒడిశాకు చెందిన గగన్ కుమార్ బిస్వాల్ (59) అక్కడికక్కడే చనిపోయాడు. రాజన్​కుమార్, ప్రకాశ్ ఛాత్రి, కర్మ​సింగ్, సుధ, చందన్​కుమార్, ప్రశాంత్​తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక దవాఖానకు తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అపర్ణ రెడీమిక్స్​కంపెనీతో పాటు వీ కన్వెన్షన్ సెంటర్​యాజమాన్యాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బషీరాబాద్ పోలీసులు తెలిపారు.  

నీళ్లలో మునిగి వృద్ధుడు మృతి?

పద్మారావునగర్: సికింద్రాబాద్‌‌ రెజిమెంటల్‌‌ బజార్‌‌లోని ఓ ఇంట్లో నేలపై పడుకున్న ఓ వృద్ధుడు తెల్లారేసరికి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఇక్కడి బస్తీలోని రోడ్లన్నీ మునిగిపోయాయి. వరద, మురుగుతో కలిసి ఇండ్లలోకి చేరింది. వర్షం రావడానికి ముందు కృష్ణ అనే వృద్ధుడు ఇంట్లో నేలపై నిద్రపోయాడు. 

వర్షం రావడంతో కుటుంబసభ్యులు అతడిని గమనించకుండా పైఅంతస్తుకు వెళ్లి పడుకున్నారు. ఉదయం చూసేసరికి కృష్ణ నీటిలో మునిగిపోయి కనిపించాడు. అంబులెన్స్ కు ఫోన్‌‌ చేసినా వరద బస్తీ రోడ్లను ముంచెత్తడంతో రాలేకపోయింది. స్థానికులే కష్టపడి దవాఖానకు తరలించారు. ఆలోపే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. అయితే కొందరు మాత్రం వృద్ధుడు గుండెపోటుతో చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.