ఓరుగల్లులో వాల్‍ పోస్టర్ల కలకలం

ఓరుగల్లులో వాల్‍ పోస్టర్ల కలకలం
  • నరేందర్​...నాపై ఎన్నికల్లో పోటీ చేసి గెలువ్​ 
  • వరంగల్​ తూర్పు ఎమ్మెల్యేకు ఎర్రబెల్లి ప్రదీప్‍రావు సవాల్​

వరంగల్/వరంగల్‍ సిటీ, వెలుగు : తన సహకారంతో గెలిచిన వరంగల్ ​తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ పదవికి రాజీనామా చేసి తనపై ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని  రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు సోదరుడు ప్రదీప్‍రావు సవాల్​ చేశారు. ఈ నెల 7న టీఆర్‍ఎస్‍ కు రాజీనామా చేసిన ప్రదీప్​రావుపై ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో స్పందించిన ప్రదీప్​రావు..నరేందర్‍కు 10వ తేదీ వరకు డెడ్‍లైన్‍ ఇస్తున్నానని చెబుతూ మంగళవారం నియోజకవర్గంలో వాల్‍ పోస్టర్లు వేశారు.

'నాడు కాళ్లా వేళ్ల పడ్డ నువ్వు ఈ రోజు స్థాయి మరిచి మాట్లాడుతున్నావ్‍ . దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రా.. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్‍గా పోటీ చేసే దమ్ము నాకుంది. ఆగస్టు10 వరకు గడువిస్తున్నా. ఓరుగల్లు గడ్డపై పుట్టిన బిడ్డగా పౌరుషం ఉంటే సవాల్‍ స్వీకరించు. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పు' అంటూ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే దారిలో ఉండే వరంగల్‍ అండర్‍ బ్రిడ్జితో పాటు రైల్వే గేట్‍, శివనగర్‍, కరీమాబాద్‍, కాశీబుగ్గ, పోచమ్మమైదాన్‍ ప్రాంతాల్లో పోస్టర్లను అంటించారు.