వనపర్తి, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి మున్సిపల్ఆఫీసులో పెట్టిన వార్డులవారీగా ముసాయిదా ఓటరు జాబితాను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ 2025, అక్టోబర్ 1 న ప్రచురించిన అసెంబ్లీ తుది ఓటరు జాబితా ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు.
తర్వాత నమోదు చేసుకునే కొత్త ఓటర్లు, మరణించిన ఓటర్ల పేర్లు పరిగణనలోకి తీసుకోమన్నారు. అక్టోబర్ లో ప్రకటించిన అసెంబ్లీ తుది ఓటరు జాబితా నుంచి పార్ట్ వారీగా వార్డుల మ్యాపింగ్ చేపట్టాలని, ఇంటి చిరునామా ఆధారంగా వార్డు ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఒక ఇంట్లో ఉన్న ఓటర్లు అందరూ ఒకే వార్డులో ఉండేలా చూడాలని చెప్పారు.
మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకునే అభ్యర్థుల పేర్లు, వారి సొంత వార్డులోనే ఓట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి 5లోపు మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని సూచించారు. తుది ఓటరు జాబితాను ఈనెల 10న విడుదల చేస్తామని తెలిపారు. ఆయన వెంట కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దారు రమేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
