
- కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు
- ఆందోళనలో వనపర్తి జిల్లా రైతులు
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో 178 మిల్లులు ఉండగా, వివిధ కారణాలతో ఈ సీజన్లో 64 మిల్లులకే వడ్లు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి వడ్ల తరలింపు ఆలస్యం అవుతోంది. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు, వడ్ల బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి ఉంటుండడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వడ్ల బస్తాలను తరలించాలని జిల్లాలోని గోపాలపేట, వీపనగండ్ల, చిన్నంబావి, శ్రీరంగాపూర్, మదనాపూర్, పెద్దమందడితో పాటు పలు మండలాల్లో ప్రతిరోజు రైతులు ఆందోళనలకు దిగుతున్నారు.
వీటితో పాటు జిల్లాలోని పలు మండలాల్లోని సెంటర్లలో వడ్ల తరలింపులో జాప్యం జరుగుతోంది. ఈ సీజన్లో 3.90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని సివిల్ సప్లయ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సన్నాలకు 238, దొడ్డు వడ్ల కోసం141 సెంటర్లు కేటాయించారు. సెంటర్లు ప్రారంభించి నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు 31శాతం అంటే 1.20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే సేకరించారు. మిగిలిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయి.
64 మిల్లులకే వడ్ల కేటాయింపు..
జిల్లాలో 178 రైసు మిల్లులున్నాయి. వీటిలో చాలా మిల్లులు సీఎంఆర్ బకాయి ఉన్నాయి. 49 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్, క్రిమినల్ కేసులు పెట్టారు. వీటితో పాటు గత సీజన్లో సీఎంఆర్ బకాయి ఉన్న వాటికి 25 శాతం బ్యాంక్ గ్యారంటీతో అండర్ టేకింగ్ తీసుకుని వడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పలువురు మిల్లర్లు అండర్ టేకింగ్ ఇవ్వకపోవడంతో ఈ సీజన్లో 64 మిల్లులకు మాత్రమే వడ్లు కేటాయించాలని నిర్ణయించారు. ఒక్కో మిల్లుకు రెట్టింపు వడ్లు కేటాయించాలని నిర్ణయించారు.
వెంటాడుతున్న హమాలీల సమస్య..
మిల్లుల్లో వడ్లు అన్లోడ్ చేసేందుకు హమాలీల సమస్య వెంటాడుతోంది. లోకల్ హమాలీలతో పాటుబిహార్ హమాలీలు అందుబాటులో ఉన్నారు. బిహార్ హమాలీలు తక్కువ చార్జీలు తీసుకొని లోడింగ్, అన్ లోడింగ్ స్పీడ్‌గా చేస్తుండడంతో వారినే తీసుకుంటున్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హమాలీలతో మాట్లాడి సీజన్ ముగిసేంత వరకు పని చేయాలని సూచించారు. అయినప్పటికీ పెద్ద మొత్తంలో వడ్లు వస్తుండడంతో అన్ లోడింగ్ సమస్య వస్తోంది. దీంతో కాంటా అయినప్పటికీ వడ్లు మిల్లులకు తరలించడం ఆలస్యమై జిల్లాలోని పలు కొనుగోలు సెంటర్లలో బస్తాల నిల్వ రోజురోజుకు పెరిగిపోతోంది.
రైతుల తిప్పలు.
వడ్లు కాంటా అయిన తరువాత రోజుల తరబడి రైతులు సెంటర్ల వద్ద కాపలా కాయాల్సి వస్తోంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో వడ్లను కాపాడుకోలేక రైతులు తిప్పలు పడుతున్నారు. ఇదిలాఉంటే రైతులకు సమస్య రాకుండా చూస్తామని, మిల్లుల వద్ద అన్లోడింగ్ త్వరగా జరిగేలా చూస్తామని సివిల్ సప్లయ్ ఆఫీసర్లు చెబుతున్నారు.