వనపర్తి, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ అప్రూవల్ రాలేదనే కారణంతో అత్యవసర సేవలు ఆపవద్దని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశానికి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి హాజరయ్యారు. ఆసుపత్రికి వచ్చే రోగులను, అత్యవసర కేసులను ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయకుండా అవసరమైన సౌలతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అవసరమైన సౌలతులు, పరికరాలపై నివేదిక అందించాలని సూచించారు. ఐసీయూ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఏడాదిగా ఆసుపత్రుల్లో నమోదైన ఓపీడీ, ఐపీడీ, రిఫర్ కేసుల వివరాలను ఆరా తీశారు. పెబ్బేరులో ఆసుపత్రి పనులు స్పీడప్ చేయాలని ఆదేశించారు. ఖిల్లాగణపురం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సౌలత్ కల్పించాలని సూచించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ కుమారి, డీఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి, ఆర్ఎంవో రెడ్డి కుమారి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు.
