స‌మోసా కావాల‌ని క‌రోనా హెల్ప్ లైన్ కి ఫోన్: కోపంతో క‌లెక్ట‌ర్..

స‌మోసా కావాల‌ని క‌రోనా హెల్ప్ లైన్ కి ఫోన్: కోపంతో క‌లెక్ట‌ర్..

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్రపంచం మొత్తాన్ని వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే ఏడు ల‌క్ష‌ల మందికి పైగా సోకిన వైర‌స్.. 34 వేల మందిని బ‌లి తీసుకుంది. భార‌త్ లోనూ రోజురోజుకీ క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దాదాపు 1100 మందికి వైర‌స్ సోకింది. అయితే వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం చాలా ముంద‌స్తుగా రంగంలోకి దిగి చ‌ర్య‌లు చేప‌ట్టింది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్ర‌క‌టించి.. ప్ర‌జ‌ల్ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని కోరింది. దీంతో వైర‌స్ వ్యాపించ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంతో పాటు ఇప్ప‌టికే వైర‌స్ సోకిన వారిని గుర్తించి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డం ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని దేశం నుంచి త‌రిమికొట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కృషి చేస్తున్నాయి. ఏ మాత్రం క‌రోనా ల‌క్షణాలు ఉన్నాయ‌నిపించినా హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌కు ఫోన్ చేయాల‌ని టోల్ ఫ్రీ నంబ‌ర్లు ప్ర‌క‌టించాయి. ప్ర‌జ‌ల‌కు వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు దాని బారిన‌ప‌డిన వారికి త‌క్ష‌ణ సాయం చేసేందేకు ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంట‌ర్ల‌ను కొంద‌రు ఆక‌తాయిలు దుర్వినియోగం చేస్తున్నారు.

అధికారుల‌కు చిరాకు తెప్పించేలా…

ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేసేందుకు పెట్టిన హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి పిచ్చి పిచ్చి ప‌నులు చెబుతున్నారు కొంద‌రు. స‌మోసాలు, పిజ్జాలు డోర్ డెలివ‌రీ చేయాల‌ని కోరుతున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో ఏవో నిత్యావ‌స‌రాలు తెచ్చుకుని వాటితో తిండి అవ‌స‌రాలు చూసుకోవ‌డం మానేసి.. ఫాస్ట్ ఫుడ్స్ కావాలంటూ అధికారుల‌ను ఇరిటేట్ చేస్తున్నారు. దీంతో యూపీలో ఓ అధికారి చిరాకు తెప్పించిన వ్య‌క్తికి త‌న స్టైల్ లో ప‌నిష్మెంట్ ఇచ్చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని రామ్ పూర్ కు చెందిన ఓ వ్య‌క్తి త‌న‌కు నాలుగు వేడి వేడి స‌మోసా డోర్ డెలివ‌రీ చేయాలంటూ హెల్ప్ లైన్ కి ఫోన్ చేశాడు. తొలుత‌ ఇది క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబ‌ర్ అని మ‌ర్యాద‌గా చెప్పారు కాల్ సెంట‌ర్ సిబ్బంది. అయినా విన‌కుండా ప‌దే ప‌దే అలాగే ఫోన్ చేసి స‌మోసాలు కావాలంటూ వాళ్ల‌ను చికాకు పెట్టాడు.

ఈ విష‌యాన్ని వాళ్లు రామ్ పూర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆంజ‌నేయ కుమార్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయ‌న ఆ వ్య‌క్తికి బుద్ధి చెప్పాల‌ని, మ‌ళ్లీ ఇలాంటి కాల్స్ రాకుండా చేయాల‌ని ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. అత‌డి ఇంటికి నాలుగు స‌మోసాలు పంపించి.. మ‌ళ్లీ ఇలా చేయ‌కుండా సామాజిక సేవతో చేయించి వెరైటీ ప‌నిష్మెంట్ ఇచ్చారు. అత‌డిని బ‌య‌ట‌కు తీసుకొచ్చి ఆ ప్రాంతంలోని డ్రైనేజీ కాలువ‌ల్ని క్లీన్ చేయించారు. మ‌ళ్లీ ఎవ‌రైనా ఇలా చేస్తే వారికీ ఇదే శిక్ష ఉంటుంద‌ని చెప్పారు.