టీఆర్ఎస్​, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వార్

టీఆర్ఎస్​, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వార్

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మంగళవారం నిర్వహించిన బల్దియా కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. ఉదయం 10.25 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 4.44 గంటలకు ముగిసింది. ముందుగా సాయుధ పోరాట అమరులకు సభ్యులు  2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 26 ఎజెండా అంశాలను జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. బీజేపీ, టీఆర్ఎస్​ కార్పొరేటర్లు పోటాపోటీగా ఆందోళనకు దిగడంతో మధ్యలో రెండుసార్లు టీ బ్రేక్ పేరుతో సభ వాయిదా పడింది.  చివరకు సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ.. హైదరాబాద్​లోనే సమస్యలు లేవని, దేశంలోని బీజేపీ పాలించే అన్ని రాష్ట్రాల్లో ఇంతకు మించిన సమస్యలు ఉన్నాయని అనడంతో బీజేపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళన నిర్వహించారు. అంతటితో మేయర్ సభను నిరవధిక వాయిదా వేశారు.  కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 4 సమావేశాలు జరిగినప్పటికీ తొలిసారి ప్రజా సమస్యలపై సభ్యులు చర్చించేందుకు అవకాశం కలిగింది.  మొత్తం 142 ప్రశ్నలు రాగా.. 12 ప్రశ్నలపై సభ్యులు  చర్చించారు. మొత్తానికి నగర రోడ్లు, చెత్త,  డ్రైనేజీ, నాలాలు, టౌన్ ప్లానింగ్ మొదలు కొని రోడ్లు ఊడ్చే మెషీన్లు, సిబ్బంది కొరత తదితర వాటిపై సభ్యులు ప్రశ్నల వర్షం కురించారు. గ్రేటర్​లో ప్రధానమైన శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఎస్ఎన్డీపీ సమస్యలపై  చర్చించారు.   సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అధికారుల తీరుపై కార్పొరేటర్లు సహా మేయర్ సైతం అసహనం వ్యక్తం చేశారు. పార్టీల ఫిరాయింపులపై సమావేశంలో రచ్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలు వసూలు చేయాలని  బీజేపీ కార్పొరేటర్లు పట్టుపట్టారు. వరుస అగ్నిప్రమాదాలపై నిలదీశారు. అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం, సమైక్య వజ్రోత్సవాల మధ్య టీఆర్ఎస్​, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశంలో  ఎమ్మెల్సీలు వాణిదేవి, ఎంఎస్ ప్రభాకర్, అమిన్ ఉల్ జాఫ్రీ, బొగ్గారం దయానంద్, ఎమ్మెల్యే దానం నాగేందర్, అహ్మద్ పాషా ఖాద్రీ, మాగంటి గోపినాథ్, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్లు బి సంతోష్, శృతి ఓజా, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు మమత, పంకజ, శంకరయ్య, సామ్రాట్ అశోక్, రవికిరణ్, శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫుడ్ సేఫ్టీపై  ప్రశ్నలు..

సిటీలో ఫుడ్ సేఫ్టీ కొరవడిందని సభ్యులు ప్రశ్నించారు. మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ..  సిటీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్య పెరిగిన కూడా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పాటై  8 ఏండ్లు గడుస్తున్నా కూడా శాంపిల్స్​ చెక్ చేసేందుకు నేటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే సెంటర్ ఉందన్నారు. గతంతో ముగ్గురు అధికారులు ఉన్న సమయంలో 6 నెలల్లో 12,075  శాంపిల్స్​ తీస్తే, ప్రస్తుతం 21 మంది అధికారులుండగా...  6 నెల్లలో కేవలం 7,932 శ్యాంపిల్స్​ మాత్రమే కలెక్ట్​ చేశారన్నారు. నామమాత్రంగా చర్యలు తీసుకోవడం వల్లే జనాలకు హెల్దీ ఫుడ్ దొరకడం లేదన్నారు. దీని కోసం కొత్త సిస్టమ్ అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ రూల్స్ ప్రకారం అధికారులు పనిచేయడం లేదన్నారు. చేతిలో ఫుడ్ సేఫ్టీ సింబర్ లేని ఖాళీ ప్యాకెట్లను కార్పొరేటర్ శ్రవణ్ ప్రదర్శించారు.  

నాలాల నిర్మాణం పూర్తి కాలే..

వర్షాలు కురిసిన ప్రతిసారి కాలనీలు నీటమునుగుతున్నాయని అధికార పార్టీ సహా అన్ని పార్టీల కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం లోపు నాలాల నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి కేటీఆర్ హమీ ఏమైందని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. ప్రస్తుతం 35 నాలాల పనుల్లో 33 పనులు జరుగుతున్నట్లు, 75 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు జవాబు ఇచ్చారు. వేరే నాలాల గురించి సభ్యులు అడగగా.. ఎస్​ఎన్​డీపీ–2( స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు వస్తే నిర్మాణాలు చేస్తామని జవాబు ఇచ్చి దాటుకున్నారు. 

కబ్జాలపై సభ్యులు ఫైర్....

గ్రేటర్​లో పార్కులు, చెరువుల పరిరక్షణపై కూడా చర్చ జరిగింది. చాలా ప్రాంతాల్లో చెరువులు, పార్కులు  కబ్జాకు గురవుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు ప్రశ్నించారు. టీఆర్ఎస్​ కార్పొరేటర్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పటాన్ చెరులో గతంలో ప్లాట్లు అమ్మిన ఓ వెంచర్ లో ఇప్పుడు రోడ్డను కలిపి అమ్ముతున్నారన్నారు.  దీనివల్ల ప్లానింగ్ చేంజ్ అవుతుందని, తర్వాత జనం ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.  అదే విధంగా చెరువుల సమీపంలో బఫర్ జోన్​లో నిర్మాణాలు జరిపారని ప్రశ్నించారు. మన్సూరాబాద్  కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పార్కులు, చెరువులు కబ్జాకు గురైనా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే అంశంపై పలువురు కార్పొరేటర్లు ప్రశ్నించారు. 

ఫిష్ మార్కెట్లను ఆధునీకరించాలె.. 

సిటీలోని ఫిష్ మార్కెట్లపై పలువురు సభ్యులు ప్రస్తావించారు. టీఆర్ఎస్​, ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు తమ ప్రాంతాల్లో ఫిష్ మార్కెట్లు బాగా లేవని, అమ్మకం
దారులను ప్రోత్సహించేందుకు కొత్తగా నిర్మాణాలు జరపాలని కోరారు. ఇదే అంశంపై మూసాపేట బీజేపీ కార్పొరేటర్ మహేందర్ మాట్లాడుతూ ఫిష్ మార్కెట్లు కొత్తగా నిర్మించాలని డిమాండ్ చేశారు. నిర్మించిన మార్కెట్లలో కూడా గులాబీ కండువా వేసుకున్న వారికి మాత్రమే స్టాల్స్​ ఇస్తున్నారని మండిపడ్డారు. నిర్మించిన వాటిలో కేంద్ర డబ్బులు కూడా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు సిటీలో మూడు చోట్ల నిర్మాణాలు చేసామని అధికారులు సమాధానం ఇచ్చారు. 

టులెట్ బోర్డులకు జరిమానాలా...

ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిపై సభ్యులు ఫైర్ అయ్యారు. సిటీలో  టులెట్ బోర్డులకు ఫైన్లు వేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారన్నారు.  ఇంటి గేట్లకు బోర్డులు పెడితే డీఆర్ఎస్​ బృందాలు పీకేస్తున్నాయన్నారు. బీజేపీ సభ కోసం ప్రింట్ చేస్తున్న ఫ్లెక్సీలను ఎందుకు సీజ్ చేశారని,  అధికార పార్టీ సమావేశాలు ఉన్నప్పుడు సెలవుపై ఎందుకు వెళుతున్నారని విశ్వజిత్ కంపాటిని బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. టులెట్ బోర్డులను ఇంటికి పెట్టుకుంటే ఫైన్లు వేయడంలేదని, పబ్లిక్ ప్లేస్​లలో పెట్టిన వారికి మాత్రమే వేశామని విశ్వజిత్ సమాధానం ఇచ్చారు. బీజేపీ ఫ్లెక్సీలు సీజ్ చేసిన  టైమ్​లో చాలా ప్రింటింగ్ ప్రెస్ లపై దాడులు చేశామని, ఆ బ్యానర్లు ఇక్కడ ఏర్పాటు చేయకపోయినా ప్రింట్ చేస్తున్నందుకే సీజ్ చేశామని ఆయన జవాబు ఇచ్చారు. సెలవుపై వెళ్లడం తన వ్యక్తిగతమన్నారు. కార్పొరేటర్ విజయా రెడ్డి మాట్లాడుతూ.. డీఆర్ఎఫ్ బృందాల వద్ద కనీసం కట్టర్లు కూడా ఉండటం లేదన్నారు.

మంత్రికి ఒకలా, సామాన్యులకు మరోలా 

తన బిల్డింగ్​లకు అడ్డంగా ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి చెట్లను నరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ఉప్పల్ కార్పొరేటర్ రజిత ప్రశ్నించారు. ఇలా హరితహారం పేరుతో 
రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా వాటిని రక్షించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సామన్యులకు ఒకలా.. మంత్రికి ఒకలా అధికారులు ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆమె అడిగారు.

నామ్ కే వాస్తేగా సమావేశం: బీజేపీ కార్పొరేటర్లు

సమావేశం అనంతరం బీజేపీ కార్పొరేటర్లు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.  మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కారం దొరకాల్సిన సమావేశాల్లో చర్చలు జరగడం లేదన్నారు. ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా అధికారులు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని.. సభను ఏదో నామమాత్రంగా నిర్వహిస్తున్నారన్నారు. గుడిమల్కాపూర్  కార్పొరేటర్ దేవర కరుణాకర్ మాట్లాడుతూ.. ఏ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. సిటీలో చెత్త సమస్య తీరడం లేదన్నారు. మన్సూరాబాద్ కార్పొరేటర్  కొప్పుల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. చెరువులు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

20 రోజులైనా జీతం ఇయ్యలే

హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ దగ్గరికి వస్తున్నా కూడా జీతాలు ఇవ్వడం లేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఊదరి గోపాల్  అన్నారు. మంగళవారం ఇదే అంశంపై కమిషనర్​కు ఆయన వినతిపత్రం అందించారు. 20వ తేదీ వచ్చినా కూడా కొందరు పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ కార్మికులకు  ఈ నెల జీతం అందలేదన్నారు. 20 రోజులు దాటినా జీతాలు ఇవ్వకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు.