ఆ బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయ్.. !

ఆ బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయ్.. !

నిన్న మొన్నటి వరకు ఆ పెట్రోల్ బంకుల్లో ఆయిల్ రేట్లు తక్కువ.. మిగతా పెట్రోల్ బంకులతో పోల్చితే లీటర్ పై 3 నుంచి 5 రూపాయల వరకు తక్కువగా ఉండేవి.. ఇప్పుడు సీన్ మారింది. కానీ నయారా బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచారు. ఆ బంకులు ఏంటీ అంటారా.. నయారా పెట్రోల్ బంకులు.. FM పెడితే చాలు.. డిస్కొంట్ రేట్లకే పెట్రోల్ కొట్టించుకోండి అంటూ ఒకటే ప్రచారం.. ఇప్పుడు మిగతా బంకులు మాదిరిగానే ధరలు పెంచేశాయి.

ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌లోని సామాన్యుడి జేబుపై పడటం మొదలైంది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ 'నయారా ఎనర్జీ' పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండుతుండటంతో లీటరుకు పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.3 రేటు పెంచేసింది. స్థానిక పన్నులను బట్టి కొన్ని రాష్ట్రాల్లో ఈ పెరుగుదల లీటరుకు రూ.5.30 వరకు కూడా ఉంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఇదే క్రమంలో ఏప్రిల్ నుంచి 35 రోజుల పాటు రిఫైనరీ కార్యకలాపాలు నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. అయితే దేశంలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 

రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ మెజారిటీ వాటాదారుగా ఉన్న నయారా ఎనర్జీ భారత్‌లో సుమారు 7 వేల పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది. పెరిగిన ముడి చమురు ఖర్చులను భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన IOC, BPCL, HPCL వంటివి నష్టాలను భరిస్తూ ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం నుండి ఎటువంటి నష్టపరిహారం అందదు. అందుకే పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకు నయారా ఈ మార్పులు చేసింది. 

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ఒక దశలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరింది. భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతాన్ని దిగుమతులపైనే ఆధారపడుతుంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా వచ్చే రవాణాకు ఇరాన్ ఆటంకాలు కలిగిస్తుండటం, ఇన్సూరెన్స్ కంపెనీలు వెనక్కి తగ్గడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది.

ALSO READ : ఇరాన్ దెబ్బకు గల్ఫ్‎లో 13 US బేస్‏లు తునాతునకలు..

సాధారణ పెట్రోల్ ధరలను ప్రభుత్వ సంస్థలు మార్చకపోయినా.. గత వారమే ప్రీమియం పెట్రోలుపై రూ.2, పారిశ్రామిక అవసరాలకు వాడే బల్క్ డీజిల్‌పై ఏకంగా లీటరుకు రూ.22 మేర ధరలను పెంచేసిన సంగతి తెలిసిందే. యుద్ధం గనుక మరింత కాలం కొనసాగితే.. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సామాన్యుడు వాడే సాధారణ పెట్రోల్ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.