కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ .. రైతుబంధుపై మాటల యుద్ధం

కాంగ్రెస్  వర్సెస్  బీఆర్ఎస్ ..  రైతుబంధుపై  మాటల యుద్ధం

హైదరాబాద్, వెలుగు:  రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎలక్షన్ నోటిఫికేషన్ లోపే నగదు బదిలీ స్కీమ్స్ అమలు చేయాలని, లేదంటే ఆ ప్రభావం ఓటర్లపై పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అయితే రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ చూస్తోందని బీఆర్ఎస్ ఫైర్ అయింది. నవంబర్ 3న ఎన్నికల​ నోటిఫికేషన్​రానున్న నేపథ్యంలో.. ఆలోపే నగదు బదిలీ స్కీమ్స్ అన్నీ అమలు చేయాలని కాంగ్రెస్​డిమాండ్ చేసింది. ఈ మేరకు సెంట్రల్​ఎలక్షన్​ కమిషన్​(సీఈసీ)కు కంప్లయింట్ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ​తర్వాత రైతుబంధు సహా ఇతర నగదు బదిలీ స్కీమ్స్ అమలు చేస్తే, ఆ ప్రభావం ఓటర్లపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకుని స్కీమ్ ల అమలును నియంత్రించాలని కోరింది. అయితే రైతుబంధు ఆన్​గోయింగ్​స్కీమ్ అని, దాన్ని నిలిపివేయాలని కోరడమంటే రైతులకు ద్రోహం చేయడమేనని బీఆర్ఎస్​నేతలు మండిపడ్డారు.

గ్రామగ్రామాన కాంగ్రెస్​దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, బీఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా కేటీఆర్, రేవంత్ రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. 

కాంగ్రెస్​ను కార్నర్ చేసేందుకు  బీఆర్ఎస్ యత్నం.. 
 
2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశారు. అయితే ఆ ప్రభావం పోలింగ్​పై పడిందని కాంగ్రెస్​నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారీ రైతుబంధు ప్రభావం ఓటర్లపై పడే అవకాశం ఉందని కాంగ్రెస్​నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్​ముఖ్య నేతలు.. సీఈసీని కలిసి రైతుబంధుపై కంప్లయింట్​చేశారు. అదను కోసం ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ లీడర్లు.. ఈ కంప్లయింట్​ఆధారంగా కాంగ్రెస్​పార్టీని కార్నర్​చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్​రైతు విరోధి అని, ఆ పార్టీ విధానాలను ఎండగట్టాలని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఆందోళనలు చేపట్టాలన్నారు. ట్విట్టర్​లోనూ కాంగ్రెస్​తీరుపై విరుచుకుపడ్డారు. మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం కాంగ్రెస్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్​ది తప్పుడు ప్రచారం: కాంగ్రెస్

తాము ఇచ్చిన కంప్లయింట్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఫైర్ అయింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్​నేతలు ఇదే అంశంపై ఏఐసీసీ హెడ్​క్వార్టర్స్​లో ప్రెస్​మీట్​పెట్టి బీఆర్ఎస్​తీరుపై మండిపడ్డారు. పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్​ కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సహా కాంగ్రెస్​ముఖ్య నేతలంతా బీఆర్ఎస్​తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధా లను నిజమని నమ్మించే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులపై బీఆర్ఎస్​కు చిత్తశుద్ధి ఉంటే, నవంబర్​3వ తేదీలోపే రైతుబంధు జమ చేయాలని సవాల్​విసిరారు. ‘‘చేతగానోళ్లే తప్పుడు ప్రచారం చేస్తారు. ఎన్నికల్లో గెలిచేది మా పార్టీనే. మేం గెలిచిన తర్వాత ఇచ్చిన గ్యారంటీ ప్రకారం పెంచిన మొత్తాన్నే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం” అని తెలిపారు.