రాష్ట్ర లోగోపై రాద్ధాంతం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం

రాష్ట్ర లోగోపై రాద్ధాంతం..  కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
  •     చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించవద్దంటూ బీఆర్ఎస్ నిరసనలు 
  •     రాష్ట్ర గీతం స్వరకర్త కీరవాణి ఆంధ్రా వ్యక్తి అంటూ కామెంట్లు  
  •     యాదాద్రి ఆర్కిటెక్ట్ ఎక్కడి వ్యక్తి అంటూ కాంగ్రెస్ కౌంటర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు కాంగ్రెస్‌, బీఆర్‌‌ఎస్ మధ్య వివాదంగా మారాయి. ప్రస్తుత లోగో రాచరికాన్ని ప్రతిబింబించేలా ఉందని, కొత్త లోగో రాష్ట్ర సంస్కృతిని, ప్రజల ఆశలు, ఆశయాలను చాటేలా ఉందని కాంగ్రెస్ చెప్తుంటే..  లోగోను మార్చాల్సిన అవసరం ఏముందని బీఆర్‌‌ఎస్ ప్రశ్నిస్తున్నది. లోగోలో చార్మినార్‌‌, కాకతీయ కళాతోరణాలు ఉండాల్సిందేనని పట్టుబడుతూ బీఆర్ఎస్​ నిరసనలు ప్రారంభించింది.

ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ‘‘ఇదిగో ఇదే కొత్త రాజముద్ర” అంటూ సోషల్ మీడియాలో ఓ లోగో సర్క్యులేట్ అవుతున్నది. ఇందులో గన్‌పార్క్​లోని తెలంగాణ అమరవీరుల స్తూపం ఉంది. చార్మినార్, కాకతీయ కళాతోరణం లేవు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ వివాదం నేపథ్యంలో లోగో విడుదలను ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతానికి రాష్ట్ర గీతాన్ని మాత్రమే జూన్ 2న విడుదల చేస్తామని ప్రకటించింది.

కాగా, రాష్ట్ర గీతానికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యతలను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడంపైనా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ వ్యక్తులకు ఇవ్వకుండా, ఆంధ్ర ప్రాంత వ్యక్తులకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నాయకులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రకుల్ ప్రీత్ సింగ్, సమంత, మంచు లక్ష్మి లాంటి ఇతర రాష్ట్రాల సినీ తారలను ప్రభుత్వం తరఫున అంబాసిడర్లుగా నియమించినప్పుడు ఈ సోయి లేదా అని నిలదీస్తున్నారు.

మరోవైపు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొడుతున్నదని బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నది. లోగోను మార్చాలనుకుంటే ప్రభుత్వం ఒక కమిటీ వేసి అందరినీ సంప్రదించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు.  

హైకోర్టుకు పోతమంటున్న బీఆర్ఎస్..  

రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని సర్కార్ నిర్ణయించగా.. దీనిపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తున్నదని, తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. లోగో మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం వరంగల్ కాకతీయ కళాతోరణం వద్ద, శుక్రవారం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు.

రాచరికపు ఆనవాళ్ల పేరుతో తెలంగాణ సంస్కృతిని మాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర లోగోను మార్చాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ అన్నారు. లోగోను మారిస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. 

యాదాద్రి ఆర్కిటెక్ట్‌ ఆంధ్రా వ్యక్తి కాదా?: ఆది శ్రీనివాస్​

టీఆర్‌‌ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుని తెలంగాణ పదాన్నే తొలగించిన ఆ పార్టీ రాష్ట్ర లోగోపై రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు రాష్ట్ర గీతం చేయాలనే సోయి లేదు. ఇప్పుడు మేం చేయిస్తుంటే కీరవాణి ఆంధ్రా వ్యక్తి అంటూ విమర్శలు చేస్తున్నది.

మరి యాదాద్రి ఆర్కిటెక్ట్ గా ఆంధ్రా వ్యక్తిని పెట్టినప్పుడు బీఆర్ఎస్ కు సోయి లేదా?” అని ప్రశ్నించారు. తెలంగాణ చిహ్నం, గీతం విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నదని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మండిపడ్డారు.  

కేసీఆర్‌‌ను జనం మర్చిపోతరనే కేటీఆర్ బాధ: మహేశ్​ కుమార్​

రాష్ట్ర చిహ్నం, గీతం తెలంగాణ ప్రజల ఆశయాలకు తగ్గట్టుగా ఉంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ‘‘కేటీఆర్ బాధ అంతా కూడా కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు మర్చిపోతరనే. కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మిని అంబాసిడర్లుగా నియమించినప్పుడు బీఆర్ఎస్ వాళ్లకు తెలంగాణవాదం గుర్తుకు రాలేదా?” అని ప్రశ్నించారు.