
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనకు నిరసనగా బుధవారం ( జూన్ 4 ) వైసీపీ వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు చోట్ల పోలీసులు వైసీపీ శ్రేణులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో గుంటురులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య నెలకొన్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది. వెన్నుపోటు దినంలో భాగంగా గుంటూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది వైసీపీ.
పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లోనికి వెళ్లే సమయంలో అంబటిని అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో స్థానిక సీఐకి, అంబటి రాంబాబుకి మధ్య వాగ్వాదం నెలకొంది. మాటా మాటా పెరిగి నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరటంతో ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది. పక్కన ఉన్న పోలీసు సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా అటు అంబటి, ఇటు సీఐ ఇద్దరూ తగ్గకపోవడంతో హీట్ పెరిగింది. సీఐ, అంబటి మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
సీఐ తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రిని వేలు చూపిస్తూ సీఐ అహంకారానికి ప్రతీక అని.. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన స్థాయిలో ఉన్న పోలీసులే ఇలా ప్రభుత్వానికి కొము కాసేలా వ్యహరిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పటానికి వెన్నుపోటు దినం సక్సెస్ అవ్వడమే నిదర్శనమని.. ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత రావడం చూసి తట్టుకోలేక కూటమి సర్కార్ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంటోందని కామెంట్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.