రిటైర్డ్ ఎంపీడీవో హత్యకు 8 లక్షల సుపారీ 

రిటైర్డ్ ఎంపీడీవో హత్యకు 8 లక్షల సుపారీ 
  • జనగామ జడ్పీ వైస్ చైర్ పర్సన్ భర్త, 
  • బీఆర్ఎస్ లీడర్ అంజయ్య సూత్రధారి 
  • భూముల విషయంలో గొడవతో మర్డర్: వరంగల్ సీపీ రంగనాథ్
  • అంజయ్య సహా ముగ్గురు అరెస్టు.. పరారీలో ఇద్దరు 
  • రిటైర్డ్ ఎంపీడీవో హత్యకు 8 లక్షల సుపారీ
  • వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడి 

వరంగల్‍, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎం పీడీవో రామకృష్ణయ్య మర్డర్ మిస్టరీ వీడింది. ఆయన్ను జనగామ జడ్పీ వైస్‍ చైర్​పర్సన్ భర్త, బీఆర్ఎస్ ​లీడర్ గిరబోయిన అంజయ్య సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ ఏవీ రంగనాథ్‍ తెలిపారు. ఈ కేసు వివరాలను ఆదివారం మీడియాకు వెల్లడించారు. అంజయ్యతో రామకృష్ణయ్యకు కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సర్వే నంబర్‍ 174 లోని భూముల విషయంలో రామకృష్ణయ్య అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయనపై అంజ య్య ద్వేషం పెంచుకున్నాడు. రామకృష్ణయ్యను చంపాలని నిర్ణయించుకొని.. దండుగుల తిరుపతితో రూ.8 లక్షలకు డీల్​ చేసుకున్నాడు. రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. మర్డర్‍ చేసేందుకు తన దగ్గరి బంధువులైన డోలకొండ శ్రీకాంత్‍, శివరాత్రి బాషా, దండుగుల రాజును తిరుపతి సంప్రదించాడు. నలుగురూ కలిసి 15న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్న రామకృష్ణయ్యను గ్రామ శివారు వద్ద కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. 

టవల్ మెడకు బిగించి హత్య.. 

రామకృష్ణయ్యను గంటపాటు కారులో తిప్పారు. చివరకు చిన్నరామన్‍చర్ల గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అక్కడ కారు ఆపి రామకృష్ణయ్య మెడకు టవల్ బిగించి, ఊపిరాడకుండా చేసి హత్య చేశా రు. ఆ తర్వాత డెడ్‍ బాడీని డిక్కీలో వేసుకుని ఓబుల్‍ కేశవాపూర్‍, పెద్ద పహాడ్‍ మీదుగా చంప క్‍ హిల్స్ ప్రాంతంలోని క్వారీ నీటి గుంతలో పడేశారు. తర్వాత బచ్చన్నపేట చేరుకుని అంజయ్యకు మర్డర్‍ విషయం చెప్పారు. కిడ్నాప్‍ చేసేందుకు తీసుకెళ్లిన కారును అంజయ్య ఇంటి వద్ద ఉంచి వెళ్లిపోయారు.

బాధితుల ఫిర్యాదు మేరకు బచ్చన్నపేట, టాస్క్​ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి.. మొదట అంజయ్యను, ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీకాంత్‍, బాషాను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, మూడు సెల్‍ఫోన్లు, రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు తిరుపతి, రాజు పరారీలో ఉన్నారు. కాగా, కేసును త్వరగా ఛేదించిన వెస్ట్ జోన్‍ డీసీపీ సీతారాం, జనగామ ఏసీపీ దేవేందర్‍ రెడ్డి, టాస్క్​ఫోర్స్ ఏసీపీ జితేందర్‍ రెడ్డి, నర్మెట్ట సీఐ నాగబాబు, బచ్చన్నపేట ఎస్సై నవీన్‍, టాస్క్​ఫోర్స్​సీఐ రాంబాబు, ఎస్సై దేవేందర్‍, శరత్ ను సీపీ అభినందించారు.