సత్యంబాబు కేసును నేను విచారించలేదు

 సత్యంబాబు కేసును నేను విచారించలేదు

పదో తరగతి పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఇరుక్కున్నామనే ఉక్రోషంతో బీజేపీ నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. ఇంతకాలం చేయని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు చేస్తు్న్నారని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.  నిందితులుగా ఉన్న వాళ్లు దర్యాప్తును తప్పు పట్టడం కామన్ అని చెప్పారు. వరంగల్ లో అనేక కేసుల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా అరెస్టు అయ్యారని తెలిపారు. బండి సంజయ్ ని ఆశ్రయించిన బాధితులు...తన వల్ల కేసుల పాలైన రౌడీలు, భూ కబ్జాదారులు, పీ.డీ యాక్ట్ బాధితులు, ఇతర నేరాలకు పాల్పడిన వారు ఉండవచ్చన్నారు. 

ఉద్యోగాన్ని వదిలేస్తా..

తాను నల్గొండ, ఖమ్మంతో పాటు..ఏపీలో అనేక ప్రాంతాల్లో డ్యూటీ చేశానని సీపీ రంగనాథ్ తెలిపారు. తాను ఎక్కడ చేసినా ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. తన కెరీర్లో ఒక్క దందా చేసినా..సెటిల్ మెంట్ చేసినట్లు నిరూపించినా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. పదో తరగతి పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో చాలామంది మెసేజ్  పంపారని..వారందరిని  విచారణకు పిలుస్తున్నామన్నారు. మీడియా వాళ్ళను కూడా విచారణకు పిలుస్తున్నామని చెప్పారు. 

రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం..

తాను రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేశానని సీపీ రంగనాథ్ తెలిపారు. ఏప్రిల్ 12వ తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ప్రజావాణి ఉంటుందని....చాలా మంది న్యాయం కోసం వస్తారని చెప్పారు. తన దగ్గరికి దళారులు రారని...సామాన్యులు.. న్యాయం కోసం నలిగిపోయిన వారే వస్తారన్నారు. సత్యం బాబు కేసుపై బండి సంజయ్ కు పూర్తి అవగాహన లేనట్లుందని చురకలంటించారు. ఆ కేసును దర్యాప్తు చేసింది తాను కాదన్నారు. తాను  ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వచ్చానని....ప్రతీ సారి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదన్నారు. చేయమంటే ప్రమాణం చేసేందుకు సిద్దమన్నారు.