ఓరుగల్లు కాలనీల్లోకి.. మొసళ్లు

ఓరుగల్లు కాలనీల్లోకి.. మొసళ్లు

వరంగల్ లో వర్షాలకు కాలనీలు జలమయమై పాములు, తేళ్లు, మొసళ్లు వస్తున్నాయి. శుక్రవారం కురిసిన వానకు కాకతీయ జూ నుంచి వరద నీటిలో వచ్చిన ఒక మొసలి చుట్టుపక్కల కాలనీవాసులను హడలెత్తించింది. జూ సిబ్బంది నాలుగైదు గంటలు శ్రమించి సాయంత్రం దాన్ని పట్టుకున్నారు.

  •     గ్రేటర్​ వరంగల్ కాలనీలు తరచూ జలమయం 
  •     ఇండ్లలోకి పాములు, తేళ్లు వస్తుండటంతో జనం అవస్థలు 
  •     తాజాగా కాలనీలో హడలెత్తించిన మొసలి
  •     ఐదు గంటలు శ్రమించి పట్టుకున్న సిబ్బంది 

హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ నగరంలో కొద్దిపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుండగా, కాలనీలను వరద నీళ్లు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే వరద నీటిలో కొట్టుకొస్తున్న పాములు, తేళ్లతో ఇబ్బందులు పడుతున్న జనం.. మొసళ్లు కూడా వస్తుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి హనుమకొండలోని కాకతీయ జూ పార్కు వరద నీటి నుంచి వచ్చిన ఒక మొసలి చుట్టుపక్కల కాలనీవాసులను హడలెత్తించింది. జూ పార్కు డ్రైనేజీ నీళ్ల నుంచి వచ్చిన మొసలి పక్కనే ఉన్న మారుతీ హిల్స్ కాలనీ, జీఎస్ఆర్ నగర్ కాలనీ వైపు వెళ్లగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. దీంతో విషయం వైరల్ అయ్యింది.

నగరంలోని కాలనీల ప్రజలు దాదాపు రెండేండ్ల నుంచి మొసళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్లే వరద నీరు భద్రకాళి చెరువులో కలుస్తుండటంతో మొసలి అందులోకి చేరి ఉంటుందని అనుమానించారు. ఈ ఘటనపై స్థానికులు శుక్రవారం ఉదయం జూ పార్కు సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది ప్లాట్లు, ఇండ్ల మధ్య నిలిచి ఉన్న నీటిలో మధ్యాహ్నం నుంచి నాలుగైదు గంటల పాటు జేసీబీ సహాయంతో తనిఖీ చేశారు. చివరకు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మొసలిని పట్టుకున్నారు. దీంతో చుట్టుపక్కల కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఆపరేషన్ లో డాక్టర్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాందాస్, వరంగల్ రెస్క్యూటీం మెంబర్స్ సాంబరాజు, కృష్ణ, స్వామి, శంకర్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. కాగా వర్షాలు పడినప్పుడల్లా మొసళ్లు ఇండ్ల మధ్యకు వస్తున్నాయని స్థానికులు వాపోయారు. ఇదే ప్రాంతంలో ఇంకో రెండు, మూడు మొసళ్లు తిరుగుతున్నాయని.. రెండేండ్ల నుంచి జూపార్కు సిబ్బంది, గ్రేటర్ ఆఫీసర్లకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండ్లలోకి పాములు, తేళ్లు..

శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి నగరంలోని సాయి గణేశ్ కాలనీ ఫేజ్1, 2, 3, 4, లక్ష్మీ గణపతి కాలనీ, ఎస్ఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్, శివనగర్ తదితర కాలనీల్లోకి నీళ్లు చేరాయి. దీంతో లోతట్టు ప్రాంత జనాలు ఆందోళన చెందారు. ఉదయం తరువాత పెద్దగా వర్షం పడకపోవడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు. కాలనీల నుంచి వరద నీళ్లు బయటకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు లేక ఇండ్ల మధ్యనే నీళ్లు నిలిచిపోతున్నాయి. దీంతో వరద నీటిలో పాములు, తేళ్లు కొట్టుకువచ్చి ఇండ్లలోకి చేరుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శుక్రవారం చింతల్, కట్టమల్లన్న గుడి ప్రాంతాల్లో పాములు ఇండ్లలోకి చొరబడటంతో స్నేక్ క్యాచర్​ సునయ్ వాటిని పట్టుకున్నారు. కాలనీలు నీళ్లలో మునగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.