
- మత్స్యకార సొసైటీ సభ్యత్వం కోసం రూ. 70 వేలు డిమాండ్
- డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన వరంగల్ జిల్లా ఫిషరీస్ ఆఫీసర్లు
వరంగల్, వెలుగు : మత్స్యశాఖలో సభ్యత్వం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన వరంగల్ జిల్లా ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని మాదన్నపేట గ్రామ మత్స్య శాఖ సొసైటీలో సభ్యత్వం కోసం పలువురు అవసరమైన విధివిధానాలను పూర్తి చేశారు. అయితే సభ్యత్వానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చేందుకు మత్స్యశాఖ వరంగల్ జిల్లా అధికారి నాగమణి రూ.70 వేలు డిమాండ్ చేశారు.
వారు డబ్బులు ఇవ్వకపోవడంతో అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వకుండా పలుమార్లు తిప్పించుకున్నారు. దీంతో బాధితులు ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు శుక్రవారం డబ్బులతో ములుగు రోడ్‌లోని మత్స్యశాఖ ఆఫీస్‌కు చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డబ్బులను ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్‌కు ఇవ్వాలని జిల్లా అధికారి నాగమణి సూచించడంతో వారు హరీశ్‌ను కలిసి డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు హరీశ్‌ను పట్టుకున్నారు. జిల్లా అధికారి నాగమణి సూచన మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు హరీశ్ చెప్పడంతో ఆమెను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ శనివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు.