ప్రదీప్ రావుపై ఎమ్మెల్యే నరేందర్ మాటల యుద్ధం

ప్రదీప్ రావుపై ఎమ్మెల్యే నరేందర్ మాటల యుద్ధం
  • త్వరలో బీజేపీలో చేరుతారని ప్రచారం 
  • వ్యక్తిగత దూషణలకు దిగడంపై సర్వత్రా విమర్శలు
  • నేడు వరంగల్లో ప్రదీప్‍రావు రాజీనామా మీటింగ్‍?

వరంగల్, వెలుగు: వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ హైకమాండ్ తీరుపై అసంతృప్తిగా ఉండగా.. ఎమ్మెల్యే నరేందర్ ఆయనపై మాటల యుద్ధానికి దిగడం చర్చనీయాంశం అయింది. పార్టీలో ఎంత కష్టపడ్డా, చివరకు తనకు అన్యాయమే జరిగిందని, టీఆర్‍ఎస్‍ కు ఇయ్యాల రాజీనామా చేస్తానని ప్రదీప్ రావు చెబుతుండగా.. ఎమ్మెల్యే నరేందర్‍ తన బర్త్​డే వేడుకల్లో గతానికి భిన్నంగా.. పరోక్షంగా ఎర్రబెల్లి ప్రదీప్​రావుపై వ్యక్తిగత దూషణకు దిగారు. దీంతో ఇరువురి మధ్య పొలిటికల్ వార్ తారస్థాయికి చేరింది.

ఎమ్మెల్యే టిక్కెట్‍ రాలే.. ఎమ్మెల్సీ ఇయ్యలే
ఉమ్మడి ఏపీలో ఎర్రబెల్లి దయాకర్‍రావు టీడీపీలో ఉండగా.. ఆయన తమ్ముడు ప్రదీప్‍రావు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాడు. రాష్ట్రాలు విడిపోయాక ఇరువురు టీఆర్‍ఎస్‍ పార్టీలో చేరారు.2014లో ఎన్నికల్లో వరంగల్‍ తూర్పు నుంచి ప్రదీప్ రావు టికెట్‍ ఆశించారు. కానీ కాంగ్రెస్‍ పార్టీ నుంచి వచ్చిన కొండా సురేఖకు హైకమాండ్‍ అవకాశమిచ్చింది. 2018 ఎన్నికల నాటికి కొండా దంపతులు పార్టీకి రాజీనామా చేయడంతో.. ప్రదీప్‍రావు మళ్లీ టీఆర్ఎస్‍ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ.. పార్టీ పెద్దలు  అప్పట్లో మేయర్‍గా ఉన్న నరేందర్‍కు టిక్కెట్ఇచ్చారు. 
దీంతో ప్రదీప్‍రావు ఇండిపెండెంట్‍గా బరిలో దిగేందుకు రెడీ అయ్యారు.

తన తమ్ముడు పోటీలో లేకుండా చూసే బాధ్యతను టీఆర్ఎస్‍ అధిష్టానం ఆయన సోదరుడు ఎర్రబెల్లి దయాకర్‍రావుకు అప్పజెప్పింది. భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇచ్చి సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చింది. గౌరవం మాటేమోగానీ.. తన మద్దతుతో గెలిచిన నరేందర్‍ అవమానాలకు గురి చేస్తున్నాడని ప్రదీప్ రావు వాపోతున్నారు. దీంతో టీఆర్ఎస్​కు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఆర్ అండ్ బీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ బుజ్జగించే ప్రయత్నం చేసినా, ప్రదీప్ రావు ఒప్పుకోలేదు. దీంతో నేడు టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

నువ్వెంత అంటే నువ్వెంత..

తూర్పు నియోజకవర్గంలో తమ సహకారంతో గెలిచిన నరేందర్‍ ఎటువంటి కార్యక్రమాలకు పిలవడంలేదని మిగతా లీడర్లు నారాజ్‍ అవుతున్నారు. ఇన్నాళ్లు నరేందర్‍ కు ఒక గ్రూపుగా ఉండగా.. ప్రదీప్‍రావు మరో గ్రూప్‍ మెయింటైన్‍ చేశాడు. ఎమ్మెల్సీ బస్వరాజ్‍ సారయ్య, మేయర్‍ గుండు సుధారాణి ఆడపాదడపా ప్రదీప్‍రావు  కార్యక్రమాలకు అటెండ్‍ అయ్యారు. ఈ క్రమంలో నరేందర్‍, ప్రదీప్‍రావు మధ్య గ్యాప్‍ పెరిగింది. లోలోపల ఉన్న గొడవలు ఫ్లెక్సీలు చింపుకోవడం, పోలీస్‍ కేసులు పెట్టుకోవడం వరకు వచ్చింది. గడిచిన ఏడాదిన్నర నుంచి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రెండు వర్గాల కేడర్‍ ఘర్షణకు దిగుతున్నాయి. దీంతో ప్రదీప్‍రావు టీఆర్ఎస్‍ పార్టీని వీడాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది.

ఎమ్మెల్యే నన్నపునేని డైరెక్ట్‍ అటాక్‍
ఎర్రబెల్లి ప్రదీప్‍రావు విషయంలో ఇన్నాళ్లు పెద్దగా విమర్శించని ఎమ్మెల్యే నరేందర్‍.. తన బర్త్ సందర్భంగా శుక్రవారం పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘అరేయ్‍.. ఒరేయ్‍.. చిల్లరగాడివి..చెంచాగాండ్లు’ అంటూ వ్యక్తిగత దూషణకు దిగాడు. ఇది నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. కాగా, రెండు రోజుల పాటు ప్రదీప్ రావు అనుచరులు దీనిపై ఎటువంటి కామెంట్‍ చేయకుండా సైలెంట్‍గా ఉన్నారు.
తూర్పుపైనే అందరి దృష్టి..

రాష్ట్రంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి తూర్పుపైనే పడింది. రాజీనామా చేస్తానని ప్రదీప్ రావు ప్రకటించడం హాట్ టాపిక్​ గా మారింది. కాగా, ప్రదీప్ రావు బీజేపీలో చేరుతారని జోరుగా చర్చ నడుస్తోంది. కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విషయంపై మౌనంగా ఉన్నారు.