
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో చాలాప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. ఐదు రోజులుగా వాటర్ సప్లై బంద్ అవగా, మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుంది. దీంతో నీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని జనాలు వాపోతున్నారు. కరీంనగర్ ఎల్ఎండీతోపాటు దేవాదుల పైపులతో ధర్మసాగర్ రిజర్వాయర్ కు వచ్చిన నీటిని వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట, ధర్మసాగర్ అండర్ రైల్వే జోన్ ఫిల్టర్ బెడ్లలో శుద్ధి చేసి, వాటి పరిధిలోని గ్రామాలు, డివిజన్లకు సరఫరా చేస్తుంటారు.
కానీ, కరీంనగర్ ఎల్ఎండీ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ కు ప్రతిరోజు 100 ఎంఎల్డీ వాటర్ సప్లై చేసే మోటర్లు, మెయిన్ గేట్ వాల్వ్ లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తాయి. ఫలితంగా ధర్మసాగర్ లోని 60 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ, 25.5 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్ లకు నీటి సరఫరా జరగడం లేదు. దీంతో 60 ఎంఎల్డీ అండర్ రైల్వే జోన్ పరిధిలోని ఎల్లాపూర్, హసన్ పర్తి, మునిపల్లి, దేవన్నపేట, సుబ్బయ్యపల్లి, రాంపూర్, మడికొండ, టేకులగూడెం తదితర విలీన గ్రామాలతో పాటు 20 ఎంఎల్డీ పరిధిలోని ధర్మసాగర్, వేలేరు, హసన్ పర్తి మండలాల వైపు కూడా వాటర్ సప్లై బంద్ అయ్యింది.
25.5 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్ పరిధిలోని పర్వతగిరి, వర్ధన్నపేట, జాఫర్ గడ్ మండలాలకు కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై నిలిచిపోవడం గమనార్హం. కాగా, కరీంనగర్ ఎల్ఎండీ పంప్ హౌజ్ వద్ద తలెత్తిన రిపేర్ల కారణంగా ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి రా వాటర్ సప్లై నిలిచిపోయింది. ఇప్పటికే ఐదు రోజులుగా నీటి సరఫరా జరగక అండర్ రైల్వే జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరో రెండు రోజులు వాటర్ సప్లై ఉండదని జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ సత్యనారాయణ ఆదివారం సాయంత్రం ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కాగా, ఇప్పటికే ఐదురోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతున్నామని, ట్యాంకర్ల ద్వారానైనా నీటిని సరఫరా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.