వరంగల్ నగర నడిబొడ్డున ప్రభుత్వ భూమి కబ్జాకు చెక్

వరంగల్  నగర నడిబొడ్డున ప్రభుత్వ భూమి కబ్జాకు చెక్

హనుమకొండ, వెలుగు: వరంగల్  నగర నడిబొడ్డున ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడారు. కోట్లు విలువ చేసే భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడి, కబ్జాకు యత్నించిన మాజీ కార్పొరేటర్ తో పాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేశారు. కాజీపేట మండలం న్యూశాయంపేట శివారు సర్వే నంబర్​23లోని ప్రభుత్వం బంచరాయి భూమిలో అక్రమ మైనింగ్  జరగడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు భద్రకాళి చెరువు పూడిక మట్టితో గుంతలను పూడ్చి చదును చేశారు. ఆ స్థలాన్ని మాజీ కార్పొరేటర్  మామిండ్ల రాజుతో పాటు మామిండ్ల సురేశ్, మల్యాల రమేశ్, మరికొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. 

ఆ స్థలంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయగా, విషయం తెలుసుకున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు దానిని తొలగించారు. దీంతో వివాదం చెలరేగి మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అది కాస్త ఉద్రిక్తతకు దారి తీయగా, కాజీపేట రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. సర్వే నంబర్​ 23లోని భూమి ప్రభుత్వందేనని గుర్తించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన మాజీ కార్పొరేటర్  మామిండ్ల రాజుతో పాటు మామిండ్ల సురేశ్, మల్యాల రమేశ్, మరికొందరిపై కాజీపేట తహసీల్దార్  సీహెచ్.రాజు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో బుధవారం సదరు భూమిని ఆర్డీవో రమేశ్  రాథోడ్  పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు.