V6 News

బాలికల భద్రతకు కేంద్రం ఏం చేస్తున్నది ? లోక్స‌‌భ‌‌లో ఎంపీ కడియం కావ్య

బాలికల భద్రతకు కేంద్రం ఏం చేస్తున్నది ? లోక్స‌‌భ‌‌లో ఎంపీ కడియం కావ్య

న్యూఢిల్లీ, వెలుగు: చదువుకునే చోట బాలికల భద్రత విషయంలో కేంద్రం తీసుకుంటున్న చ‌‌ర్యలేంటని వరంగల్ ఎంపీ కడియం కావ్య లోక్​సభలో ప్రశ్నించారు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ చేస్తున్న ఒడిశాకు చెందిన ఒక దళిత విద్యార్థిని ఇటీవల అత్యాచార వేధింపులకు గురికావడంపై ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేధింపుల కారణంగా ఆ దళిత విద్యార్థిని మధ్యలోనే చదువు మానేసిందన్నారు. ఈ విషయాన్ని సోమ‌‌వారం లోక్​స‌‌భ‌‌  ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. దేశంలోని విద్యాసంస్థల్లో బాలికలు, మహిళా విద్యార్థులపై ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

‘భేటీ పడావో అన్న నినాదం పాఠశాల గోడలకే పరిమితమా? విద్యాలయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న యువతులకు రక్షణ ఎక్కడ?’ అని కేంద్రాన్ని నిల‌‌దీశారు. విద్యా సంస్థల్లో మహిళల భద్రతను కాపాడే వ్యవస్థలు ఎంత వరకు పనిచేస్తున్నాయో చెప్పాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో.. ప్రత్యేకించి విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరుగుతున్నదని ఆమె సభ దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై కేంద్రం వెంటనే కఠిన తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

వరంగల్లో డ్రాపౌట్లు ఆందోళనకరం
వరంగల్‌‌ జిల్లాలో సెకండరీ ఎడ్యుకేషన్​ స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్‌‌ (బడి మానేయడం) రేటు ఆందోళనకరంగా ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఏకంగా 22.45 శాతం డ్రాపౌట్‌‌ రేటు నమోదైనట్లు వెల్లడించింది. సోమవారం లోక్‌‌సభలో వరంగల్‌‌ ఎంపీ  కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ ఈ మేరకు సమాధానమిచ్చారు.