
- 20 ఏండ్ల కింద మూసివేయగా గత పాలకుల నిర్లక్ష్యం
- హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ మ్యూజియం తర్వాత రెండోది ఇదే
- అందుబాటులోకి వస్తే.. లక్షలాది స్కూల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం
- విశ్వం, గ్రహాల పనితీరును తెరపై చూసి విజ్ఞానం పొందే చాన్స్
వరంగల్, వెలుగు : రెండు దశాబ్దాల కింద మూతపడిన వరంగల్ నక్షత్రశాల(ప్లానిటేరియం) త్వరలో తెరుచుకోనుంది. పాఠశాల విద్యలో భాగంగా స్టూడెంట్లకు విశ్వం పుట్టుక, గ్రహాల వింతలు, విశేషాల పై సైన్స్ టీచర్లు తరగతి గదుల్లో బోధిస్తే.. వాటిని నక్షత్రశాలలో కూడా వీక్షించేవారు. ఉపాధ్యాయులు చెప్పే క్లాసులతో పాటు ప్లానిటేరియం అందించే విజ్ఞానంతో విద్యార్థులకు విశ్వం, గ్రహాల పనితీరు కండ్లకు కట్టినట్టు అర్థమయ్యేది.
ఇలాంటి నక్షత్రశాలపై గత పాలకులకు పట్టింపులేకపోయింది. ఓరుగల్లులో ప్రతాపరుద్ర ప్లానిటేరియం ఒకటుందనేది కూడా ఇప్పటి విద్యార్థులకు తెలియకుండా మరుగున పడింది. ఇరవై ఏండ్ల తర్వాత రూ.6 కోట్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ తో నిర్మిస్తున్న అత్యాధునిక నక్షత్రశాల త్వరలో మళ్లీ అందుబాటులోకి రానుంది.
1984 నుంచి సేవలు అందించగా..
రాష్ట్రంలో హైదరాబాద్ లోని బిర్లా ప్లానిటేరియం సైన్స్ మ్యూజియం తర్వాత వరంగల్ లో మ్యూజికల్ గార్డెన్ పక్కనే హిందూజా ప్రతాపరుద్ర ప్లానిటేరియం ఉండేంది. 1982 రూ.1 లక్ష 20 వేల తో నిర్మాణం చేపట్టగా.. 1983లో పనులు పూర్తి చేసు కుంది. 1984లో దీన్ని ప్రారంభించారు. అనంతరం 2002 జులై దాకా సేవలు అందించిన ప్లానిటేరియంలోని స్క్రీన్, ప్రొజెక్టర్, సౌండ్ సిస్టం ఒక్కొక్కటిగా పనిచేయకపోవడంతో షోలు బంద్ అయ్యాయి.
70 శాతం పనులు పూర్తయ్యాయని..
గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ప్లానిటోరియం ఆధునీకరణ పనులు చేపట్టారు. సుమారు రూ.6 కోట్లతో రెండు భాగాలుగా డెవలప్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దెబ్బతిన్న గోడలను రిపేర్ చేయడంతో పాటు వెయిటింగ్ రూమ్స్, సీలింగ్, లైటింగ్, టాయిలెట్లు, టైల్స్ వంటి పనులు చివరి దశకు చేరాయి. కాగా, ప్లానిటేరియం నిర్వహణలో ప్రధానమైన ప్రదర్శన గది పనులను హైదరాబాద్‍కు చెందిన ఓ సంస్థ దక్కించుకున్నట్లు బల్దియా అధికారులు తెలిపారు.
మూడు నెలల కింద 70 శాతం పనులు పూర్తయ్యాయని, మరో నెలలో ప్లానిటేరియం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. తీరాచూస్తే, పనులు నత్తనడకన సాగుతున్నాయి. నక్షత్రశాలకు ప్రధానమైన గ్లోబ్ ఆకారంలో ఉండే గదిలో 3 డీ స్క్రీన్, డిజిటల్ లైటింగ్, సౌండ్ సిస్టం, సీటింగ్ వంటి పనులు ఇంకా మొదలుపెట్టనేలేదు. అధికారులు మాత్రం పనులను స్పీడ్ గా చేస్తున్నామని చెబుతున్నారు.
నక్షత్రశాల స్పెషాలిటీ ఏంటంటే..
నక్షత్రశాలలో 80 మంది కూర్చుని వీక్షించేలా చిన్నపాటి సినిమా థియేటర్‍గా నిర్మించారు. మూవీని ఎదురుగా కూర్చుని చూస్తే.. ప్లానిటేరియంలో ఆరుబయట పడుకుని రాత్రి ఆకాశంలో చుక్కలను చూసే డైరెక్షన్‍లో సీటింగ్ ఉంటుంది. విశ్వం పుట్టుక, గ్రహాలైన అంగారకుడు(మార్స్), బృహస్పతి (జూపిటర్), శుక్రుడు(వీనస్), భూమి (ఎర్త్), శని (సాటర్న్), బుధుడు (మెర్క్యూరీ), కేతువు (నెప్ట్యూన్), రాహువు (యురేనస్) వంటివి విశ్వంలో ఎలా తిరుగుతాయో, వాటి వివరాలను సినిమా లాగా చూపిస్తూ అత్యాధునిక సౌండ్ సిస్టంలో వాటి గొప్పదనాన్ని వినిపిస్తుంది. ఒక సినిమా కథ వినడానికి, చూడటానికి ఎలా ఉంటుందో.. ఖగోళంలోని గ్రహాల పనితీరు తెలుసుకోవడానికి ప్లానిటేరియం కూడా చిత్రం రూపంలో అలాంటి అనుభూతిని కలిగిస్తుంది.