చైన్‌‌‌‌ లింక్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ పేరుతో రూ. 16 కోట్లు వసూలు.. నలుగురు అరెస్ట్

చైన్‌‌‌‌ లింక్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ పేరుతో రూ. 16 కోట్లు వసూలు.. నలుగురు అరెస్ట్

వరంగల్‍, వెలుగు : చైన్‌‌‌‌ లింక్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిన నలుగురు వ్యక్తులను వరంగల్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సన్‌‌‌‌ప్రీత్‌‌‌‌సింగ్‌‌‌‌ బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా గడ్డిపల్లికి చెందిన తెప్పాలి సైదులు, పెన్‌‌‌‌పహాడ్‌‌‌‌కు చెందిన పొడిల సురేశ్‌‌‌‌కుమార్‌‌‌‌, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన పొడిల శ్రీధర్‌‌‌‌, ఏపీలోని కృష్టా జిల్లా నందిగామకు చెందిన మనుబోతుల రామకృష్ణ ముఠాగా ఏర్పడి 2023లో హెబ్సిబా పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తమ సంస్థలో రూ. 6 వేలు కట్టి ఏజెంట్‌‌‌‌గా చేరితే.. మొదట్లోనే రూ. 2వేల విలువైన బహుమతి ఇవ్వడంతో పాటు కొత్త సభ్యులను చేర్పించిన వారికి 20 నెలల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తామంటూ నమ్మించారు. 

ఇలా వివిధ జిల్లాలకు చెందిన 28,493 మంది నుంచి రూ. 6 వేల చొప్పున వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన మొత్తం సుమారు రూ. 16 కోట్లను తమ వద్దే పెట్టుకున్నారు. చైన్‌‌‌‌ లింక్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం పోలీసులకు తెలియడంతో విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం నలుగురిని అదుపులోకి తీసుకొని, మొత్తం 17 బ్యాంకుల్లో డిపాజిట్‌‌‌‌ చేసిన సుమారు రూ.5.48 కోట్లను బ్లాక్‌‌‌‌ చేశారు. 

నిందితుడు సైదులుపైన మెదక్‍, సూర్యాపేట, ఇల్లందు, ఎల్‌‌‌‌బీనగర్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో సైతం కేసులు ఉన్నట్లు సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.5.92 లక్షలతో పాటు 685.5 గ్రాముల బంగారు అభరణాలు, కారు, సెల్‌‌‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాని చెప్పారు. నిందితులను పట్టుకున్న వెస్ట్‌‌‌‌జోన్‌‌‌‌ డీసీపీ రాజమహేంద్రనాయక్‍, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఏసీపీ మధుసూదన్‍, సీఐలు పవన్‍. జానకీ రాంరెడ్డి, ఎస్సై వంశీకృష్ణను సీపీ అభినందించారు.