చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: నగరంలోని చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో మంత్రి పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 

అమృత్ పథకం కింద రూ.6 కోట్లతో చిన్న వడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువుల పునరుద్ధరణ, పునర్జీవన పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉర్సు రంగసముద్రం, దేశాయిపేట చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు, పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని చెప్పారు. 

ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి మేయర్, కమిషనర్, కలెక్టర్ల సమన్వయంతో కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణతో పాటు, ప్రజలకు శుభ్రమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్, కార్పొరేటర్లు సురేశ్​జోషి, మరుపల్ల రవి తదితరులు పాల్గొన్నారు.