
కరీంనగర్ టౌన్, వెలుగు: తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్స్ జూడో చాంపియన్ షిప్ ను వరంగల్ టీం కైవసం చేసుకుంది. రెండో, మూడో స్థానంలో హైదరాబాద్, అదిలాబాద్ జట్లు నిలిచాయి. ఆదివారం స్థానిక మంకమ్మతోటలోని సాయిమానేర్ స్కూల్ లో రెండ్రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల ముగింపు కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ కడారు అనంతరెడ్డి, ఆర్డీవో మహేశ్వర్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈనెల 28నుంచి సెప్టెంబర్1వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అక్కడ కూడా విజయం సాధించి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతా రెడ్డి, భారత జూడో సమాఖ్య కోశాధికారి బి.కైలాస్ యాదవ్, జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్ రెడ్డి, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ సీహెచ్ రమణా చారి తదితరులు పాల్గొన్నారు.