TG20 లీగ్ వేలం: స్టార్ బౌలర్ సిరాజ్‎కు భారీ ధర.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిందంటే..?

TG20 లీగ్ వేలం: స్టార్ బౌలర్ సిరాజ్‎కు భారీ ధర.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిందంటే..?

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న టీజీ 20 లీగ్ వేలంలో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. ఆదివారం (జూన్ 7) రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన వేలంలో రూ.14 లక్షల భారీ ధరకు సిరాజ్‎ను వరంగల్ వారియర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఐకాన్ ప్లేయర్స్ కేటగిరీలో కనీస ధర రూ.5 లక్షలతో వేలంలోకి వచ్చిన సిరాజ్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు రూ.14 లక్షల భారీ ధరకు వరంగల్ వారియర్స్ సిరాజ్‎ను సొంతం చేసుకుంది. 

ప్రతిష్టాత్మకంగా టీజీ 20 క్రికెట్ లీగ్:

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా టీజీ 20 లీగ్ నిర్వహిస్తోంది. ఈ లీగ్‎లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి. 21 రోజుల పాటు 32 మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. HCAలో నమోదైన 1,300 మందికి పైగా ఆటగాళ్లు వేలంలో పాల్గొ్న్నారు. 

టీమిండియా స్టార్ క్రికెటర్స్ మహ్మద్ సిరాజ్ ,తిలక్ వర్మ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సీనియర్ క్రికెటర్లు రోహిత్ రాయుడు, రాహుల్ బుద్ది, సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్ కూడా వేలం బరిలో ఉన్నారు. అండర్-19 ప్రపంచకప్ ఆటగాడు ఆరోన్ జార్జ్‌తో పాటు హైదరాబాద్ యువ క్రికెటర్లు కూడా వేలంలో ఉన్నారు.

ప్రతి టీమ్‎కు రూ.60 లక్షల పర్స్ మనీ కేటాయింపు. ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 20 మంది ప్లేయర్స్‎ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కో టీమ్ కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి. వేలం ఐకాన్, A+, A, B, C1, C2 కేటగిరీల వారీగా జరుగుతుంది. గ్రామీణ ప్రతిభకు ప్రోత్సాహంగా ప్రతి టీమ్‎లో కనీసం 4 జిల్లాల ఆటగాళ్లు ఉండాలి. ప్లేయింగ్ ఎలెవన్‌లో కనీసం రెండు జిల్లాల ప్లేయర్స్ ఆడటం తప్పనిసరి.