
- ఉదయం నోటిఫికేషన్లు జారీచేసిన కలెక్టర్లు
- ఎన్నికల పరిశీలకులుగా జిల్లాలకు చేరుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు
- సాయంత్రం కోర్టు ప్రకటనతో స్థానిక ఎన్నికలకు బ్రేక్
- బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేతో ఆశావహుల్లో నిరాశ
- పలుచోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు పల్లెల్లో ఉదయం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ హడావుడితో ఖుషీగా కనిపించిన నాయకులు సాయంత్రం ఒక్కసారిగా ఢీలా పడ్డారు. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో 75 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, మొదటి విడత ఎన్నికల్లో 37 స్థానాలు, 393 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు అధికారులు రెడీ అయ్యారు. గురువారం ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణకు ఆయా మండలాల పరిధిలో ఎంపీడీవో కార్యాలయాల్లో కావాల్సిన ఏర్పాట్లు సైతం చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జిల్లా ఎన్నికల పరిశీలకులుగా పలుచోట్ల ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లాలకు చేరుకున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్లు, సిబ్బంది మండలాలకు చేరుకుని డ్యూటీల్లో చేరారు. మరోవైపు ఎన్నికలు పార్టీ గుర్తులతో నిర్వహించనున్న నేపథ్యంలో ఆశావహులు ఓవైపు టిక్కెట్ల కోసం ఎమ్మెల్యేలు, ఆయా పార్టీ పెద్దలను కలుస్తూనే మరోవైపు నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమయ్యారు. కాగా, ప్రధాన పార్టీల నేతలు మాత్రం కోర్టు తీర్పుపై కొంత ఉత్కంఠగా ఎదురుచూశారు.
తీరా సాయంత్రం నాలుగు గంటల సమయంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్లలో బరిలో నిలిచి అదృష్టం పరీక్షించుకోవాలని భావించిన అభ్యర్థులు ఒక్కసారిగా డల్ అయ్యారు.
3 జడ్పీటీసీ, 9 ఎంపీటీసీ నామినేషన్లు..
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉండేందుకు అభ్యర్థులు ఉత్సాహంగా ఉన్నా, బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో కోర్టు తీసుకునే నిర్ణయంపై అందరూ ఎదురుచూశారు. దీంతో మొదటిరోజు నామినేషన్లు వేసేందుకు పెద్దగా ముందుకురాలేదు.
మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ రూరల్ మండల జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా ఎల్లది మల్లయ్య, మరో 5 మంది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశారు.
హనుమకొండ జిల్లాలో హసన్‍పర్తి జడ్పీటీసీ స్థానానికి మల్లారెడ్డిపల్లెకు చెందిన పుట్ట లక్ష్మితోపాటు జయగిరి ఎంపీటీసీ స్థానానికి పల్లె వేణు నామినేషన్లు వేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం బాగిర్తిపేట ఎంపీటీసీ అభ్యర్థిగా బీఆర్‍ఎస్ నుంచి శ్రీపతి రవీందర్ నామినేషన్ దాఖలు చేశారు.
వరంగల్ జిల్లా సంగెం మండల జడ్పీటీసీగా ఒకరు, ఇదే మండలంలోని మొండ్రాయి గ్రామ ఎంపీటీసీ, గీసుగొండ మండలం మునుగొండ ఎంపీటీసీ స్థానం కోసం ఒకరు నామినేషన్లు అందించగా, జనగామ, ములుగు జిల్లాల్లో ఎవరూ ఆసక్తి చూపలేదు.