బీసీ గురుకులంలో అన్నం బాలేదన్నందుకు స్టూడెంట్లను చితకబాదిన వార్డెన్, పీఈటీ

బీసీ గురుకులంలో అన్నం బాలేదన్నందుకు స్టూడెంట్లను చితకబాదిన వార్డెన్, పీఈటీ
  • బీసీ గురుకులంలో ఘటన
  • పీఈటీపై తల్లిదండ్రుల ఆగ్రహం

అశ్వారావుపేట, వెలుగు: అన్నం బాగుండడం లేదని మీడియాకు చెప్పినందుకు వార్డెన్, పీఈటీ స్టూడెంట్లను చితకబాదారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టౌన్ గుర్రాల చెరువు రోడ్డులోని బీసీ బాలుర గురుకులంలో గుమ్మడవల్లి గ్రామానికి చెందిన చరణ్ రెడ్డి 9వ తరగతి చదువుతున్నాడు. అతడితోపాటు మరికొందరు స్టూడెంట్స్ భోజనం, స్నాక్స్, టిఫిన్ బాగుండటం లేదని వార్డెన్ ను నిలదీశారు. తింటే తినండి.. లేకపోతే లేదు.. మాకు ఇవే పంపించారని, వాటితోనే వంటలు చేసి పెడతామని వార్డెన్ స్టూడెంట్స్ తో అన్నాడు. 

దీంతో శనివారం స్టూడెంట్లు మీడియాకు విషయం చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వార్డెన్ రామారావు మీడియాతో మాట్లాడిన స్టూడెంట్లను పీఈటీ సురేశ్​సహాయంతో చితకబాదాడు.  పీఈటీ కొట్టిన దెబ్బలకు చరణ్​కు వాతలు తేలాయి. చరణ్ ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ప్రజాప్రతినిధులను వెంటతీసుకొని తండ్రి గురుకులానికి చేరుకున్నాడు. పీఈటీని పిలిపించి అడగగా ఈ ఒక్కసారికి క్షమించమని బతిమాలాడు. ఇలా మరోసారి జరగకుండా చూసుకుంటామని ప్రిన్సిపల్ మల్లికార్జునరావు హామీ ఇవ్వడంతో పేరెంట్స్ వెనుతిరిగారు.