
బర్మింగ్‌హామ్: విరాట్ కోహ్లీ, అశ్విన్ ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ పాజిటివ్‌గా తేలి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు మరవొద్దని, రద్దీ ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దని బీసీసీఐ, మెడికల్ టీమ్ హెచ్చరించినా ఇండియా ఆటగాళ్లు పట్టించుకోవడం లేదు. బోర్డు సూచనలను పక్కనబెట్టిన టెస్టు ప్లేయర్లంతా బర్మింగ్‌హామ్‌లో ఓ హోటల్‌కు వెళ్లి లంచ్ చేశారు. మాజీ కెప్టెన్ విరాట్, పంత్, శ్రేయస్, సిరాజ్, గిల్, సైనీ, శార్దూల్, కమలేశ్.. హోటల్ సిబ్బందితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. మరోవైపు కేఎస్ భరత్, జడేజా బర్మింగ్‌హామ్ వీధుల్లో తిరగ్గా.. కోహ్లీ మరోసారి గుంపుగా ఉన్న ఫ్యాన్స్‌తో కలిసి ఫొటో దిగాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో క్రికెటర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కరోనా ముప్పు ఉన్నప్పటికీ.. ఇంత అజాగ్రత్తగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెటర్లను మరోసారి హెచ్చరిస్తామని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.