అలంపూర్ ఎమ్మార్వోకు వారెంట్.. స్టూడెంట్​కు సర్టిఫికెట్​ జారీ కేసులో విచారణకు గైర్హాజరు

అలంపూర్ ఎమ్మార్వోకు వారెంట్.. స్టూడెంట్​కు సర్టిఫికెట్​ జారీ కేసులో విచారణకు గైర్హాజరు
  • ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ఏపీలో చదివిన స్టూడెంట్ కు స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసిన కేసులో విచారణకు గైర్హాజరైన అలంపూర్ తహసీల్దార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు తహసీల్దారు నవంబరు10న కోర్టులో హాజరయ్యేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన నిబంధనపై ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించినా తన అప్లికేషన్ను పరిగణనలోకి తీసుకోలేదంటూ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​కు చెందిన సింగోటం వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోక్ ఆరాధే, జస్టిన్ ఎస్వీ శ్రవణ్​కుమార్​ల బెంచ్ మంగళవారం విచారించింది. ఒకటి నుంచి10 వరకు కర్నూలులో, ఇంటర్ కృష్ణా జిల్లాలో చదివిన విద్యార్థిని వెన్నెలకు మెడికల్ అడ్మిషన్ల నిమిత్తం అలంపూర్​లో గత 18 ఏండ్లుగా నివాసం ఉంటున్నట్లు ధ్రువీకరణ పత్రం జారీ చేయడంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ అక్టోబరు 4న హైకోర్టు తహసీల్దార్​ను ఆదేశించింది. నేటి విచారణకు హాజరు కాకపోవడంతో మండిపడింది. తహసీల్దార్ తరఫున కనీసం లాయర్ కూడా హాజరు కాలేదని తప్పుబట్టింది. బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నవంబర్​10న తహసీల్దార్ కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని పోలీసులను ఆదేశించింది.