800 కోట్ల రూపాయల నష్టంతో పేటీఎం షేర్లు అమ్మిన బఫెట్‌

 800 కోట్ల రూపాయల నష్టంతో పేటీఎం షేర్లు అమ్మిన బఫెట్‌

న్యూఢిల్లీ: సీనియర్ ఇన్వెస్టర్ వారెన్‌‌‌‌ బఫెట్‌‌‌‌కు చెందిన ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ కంపెనీ బెర్క్‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌ హత్​వే పేటీఎంలోని తమ మొత్తం వాటాను  అమ్మేసింది. వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (పేటీఎం పేరెంట్ కంపెనీ) లోని  మొత్తం వాటాలను రూ.800 కోట్ల నష్టానికి అమ్మినట్టు ఎక్స్చేంజ్‌‌‌‌ల డేటా ద్వారా తెలుస్తోంది.  మొత్తం 1.56 కోట్ల షేర్లు లేదా 2.5 శాతం వాటాను రూ.1,370 కోట్లకు షేరు ధర రూ.877.29 దగ్గర  సేల్ చేసింది. 

ఐదేళ్ల కిందట పేటీఎంలో  2.6 శాతం వాటాను రూ.2,200 కోట్లకు (300 మిలియన్ డాలర్లకు) వారెన్‌‌‌‌ బఫెట్ కంపెనీ కొనుగోలు చేసింది. అప్పుడు పేటీఎం వాల్యుయేషన్ 10–-12 బిలియన్ డాలర్లుగా ఉంది. వారెన్ బఫెట్ ఇన్వెస్ట్ చేసిన మొదటి ఇండియన్ కంపెనీ ఇదే కావడం విశేషం. కంపెనీ ఫౌండర్ విజయశేఖర శర్మ కేవలం ఒక్క మీటింగ్‌‌‌‌, మూడు ఫోన్ కాల్స్‌‌‌‌తో బఫెట్ మనసు మార్చారని రూమర్లు ఉన్నాయి.  

పేటీఎం షేర్లు ఎంఎస్‌‌‌‌సీఐ గ్లోబల్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లో  కొనసాగుతున్నాయి. కంపెనీ షేర్లు శుక్రవారం సెషన్‌‌‌‌లో 3 శాతం తగ్గి రూ.895 దగ్గర క్లోజయ్యాయి.  కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు  68 శాతం పెరిగాయి.