
- గ్రేటర్లో వెయ్యి కాలనీల్లో తీవ్రమైన సమస్య
- వానలకు తడిసి కంపు కొడుతున్నయ్
- పలుచోట్ల వారానికోసారి కూడా ఊడ్వని పరిస్థితి
- మిగిలినచోట 2 - 3 రోజులకోసారి క్లీనింగ్
హైదరాబాద్ : సిటీలోని కాలనీలు, బస్తీల్లో చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. మెయిన్ రోడ్ల వెంటా ఇదే పరిస్థితి నెలకొంది. అటుగా వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందేనని, దోమలు, ఈగలకు ఆవాసంగా మారుతున్నాయని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లో దాదాపు 5 వేల కాలనీలు ఉండగా వెయ్యికిపైగా కాలనీల్లో చెత్త సమస్య తీవ్రంగా ఉంది. మిగిలిన చోట రెండు, మూడ్రోజులకోసారి క్లీన్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వానలు మొదలైనప్పటి నుంచి రోడ్లు ఊడ్చే కార్మికులు అస్సలు కనిపించడం లేదని జనం అంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్వాన్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజిగిరి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, మలక్ పేట, జూబ్లీ హిల్స్, బేగంపేట, మూసాపేట, పఠాన్ చెరు, సరూర్ నగర్ తదితర సర్కిళ్లల్లో చెత్త సమస్య ఎక్కువగా ఉంది. వానలకు చెత్త తడిసి భరించలేని కంపు కొడుతోంది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలు 4,500 ఉన్నప్పటికీ వెయ్యి కూడా ఫీల్డ్‌లోకి రావడం లేదు. వస్తున్న వాటి డ్రైవర్లు, సిబ్బంది అదనంగా డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఎఫ్ఏల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతోందని, కార్మికుల నకిలీ ఫింగర్ ప్రింట్లతో మోసాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ఇవేం పట్టించుకోవడం లేదు.
వాళ్లు పట్టించుకోకనే..
30 సర్కిళ్లలోని మెయిన్‌రోడ్లను సీఆర్ఎంపీ కింద ప్రైవేట్ఏజెన్సీలకు అప్పగించారు. 709కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రోడ్ల నిర్వహణను ఇవే చూసుకుంటున్నాయి. మిగిలిన ప్రాంతాలను క్లీన్చేసేందుకు జీహెచ్ఎంసీ కార్మికులు 26,500 కార్మికులు ఉన్నారు. వీరిని 948 మంది ఎస్ఎఫ్ఏలు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో ఎస్ఎఫ్ఏ కింద మూడు గ్రూపులు ఉంటాయి. ఒక్కో దానిలో ఏడు మంది పైనే కార్మికులు ఉంటారు. రోజూ కేటాయించిన ప్రాంతాలను క్లీన్చేయడమే వీరి పని. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదు. చెత్త సమస్య పెరిగి జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలీంనగర్ నుంచి కాలనీలు, బస్తీల వరకు చెత్త కుప్పులు పేరుకుపోతున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకి, పార్శిగుట్ట, యూసుఫ్‌గూడ, సుల్తాన్ బజార్, అల్వాల్, మల్కాజిగిరి డిఫెన్స్ కాలనీ, కోఠి, అబిడ్స్, కింగ్ కోఠి, అమీర్ పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జీడిమెట్ల, కూకట్పల్లి, మాదాపూర్, గౌలిపురా, బండ్లగూడ, లాల్ దర్వాజ తదితర ప్రాంతాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి కంపు కొడుతోంది. చాలా ప్రాంతాల్లోకి స్వచ్ఛ ఆటోలు రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఆటోలు టైమ్ కు రాకపోవడంతోనే గతంలో జీహెచ్ఎంసీ డస్ట్బిన్లు ఉండే ప్రదేశంలో పోస్తున్నామని చెబుతున్నారు. ఇంటి బయటపెట్టి వెళ్తే కుక్కలు పాడుచేసి కరాబ్చేస్తున్నాయని, తప్పనిసరి పరిస్థితిలో రోడ్ల వెంట పోస్తున్నామంటున్నారు.
రోగాలతో ఆందోళన
ప్రస్తుతం వైరల్ ఫీవర్ల బాధితుల సంఖ్య పెరుగుతోంది. నాలుగు రోజులుగా సిటీలో 50 వేల మందికిపైగా ఫీవర్‌బారిన పడ్డారు. ఓ పక్క రోగాలు, మరో పక్క చెత్త కుప్పులు, దోమల విజృంభనతో జనం బెంబెలెత్తిపోతున్నారు. సిటీలోని 250 ప్రాంతాల్లో జ్వరాలు ఎక్కువగా ఉన్నట్లు, వీటిని హైరిస్క్ గా గుర్తించారు. కానీ వీటిలోనూ బల్దియా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ కూడా చెత్త పేరుకుపోతోంది.
10 రోజులకోసారి తీస్తున్నరు..
రోడ్ల పక్కన పోస్తున్న చెత్తను10 రోజులకోసారి తీస్తున్నారు. కాలనీల్లోని రోడ్లనూ సరిగా ఊడుస్తలేరు. ఇంటి నుంచి బయటికి వస్తే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. చెత్త పోయకుండా చర్యలు తీసుకోవాలి. రోడ్లను రోజూ ఊడ్చేలా చూడాలి. - సుదర్శన్, గుడిమల్కాపూర్
దోమలు, ఈగలు పెరుగుతున్నయ్
గతంలో చెత్త డబ్బాలు ఉండేవి. ఇండ్లలోని చెత్తను వాటిలో వేసేవారు. ప్రస్తుతం అవి లేకపోవడం, టైంకు ఆటోలు రాకపోవడంతో చాలామంది రోడ్ల వెంట చెత్తపోస్తున్నారు. అలా పేరుకుపోతున్న కుప్పలను వారానికి రెండు సార్లు మాత్రమే క్లీన్ చేస్తున్నారు. దీంతో రోడ్ల దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలు పెరిగిపోతున్నాయి. - వంశీ, రెడ్ హిల్స్