ఇలాంటి పిటిషన్లతో సుప్రీంకోర్టు సమయం వృథా : కిరణ్ రిజిజు

ఇలాంటి పిటిషన్లతో సుప్రీంకోర్టు సమయం వృథా : కిరణ్ రిజిజు

గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట‌రీని బ్యాన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6న విచారణ జరపనుంది. అయితే పిటిషన్ వేసిన వారిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఇలాంటి పిటిషన్లతో సుప్రీం కోర్టు విలువైన సమయం వృథా అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. ‘‘సామాన్యులు తమకు న్యాయం జరగాలని సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తుంటే.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు విలువైన సమయం వృథా అవుతోంది’’ అని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. విచారించేందుకు సుప్రీం కోర్టే అంగీకారం తెలిపాక.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకని కొందరు విమర్శిస్తున్నారు. 

ఈ ఏడాది జనవరి 21న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎమ్‌ఎల్ శర్మ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. బీబీసీ డాక్యుమెంటరీలోని రెండు భాగాలనూ పరిశీలించాలని కోర్టుని కోరారు. గుజరాత్ అల్లర్లపై నిజానిజాలు తెలుసుకునే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టికల్ 19 (1) (2) ప్రకారం ఆ హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ఉత్తర్వులతో కేంద్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛనూ అణిచివేయాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ డాక్యుమెంటరీలో ఎన్నో నిజాలు ఉండొచ్చని, అవే సాక్ష్యాధారాలుగానూ మారే అవకాశముందని అన్నారు. ఈ విషయాలు వెలుగులోకి వస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని పిటిషన్‌లో ప్రస్తావించారు.